అన్నదాతకు భరోసా
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:50 AM
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం జిల్లా వ్యాప్తంగా శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

- అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాకు రూ.161.45 కోట్లు విడుదల
- 2,42,536 మంది రైతులకు లబ్ధి
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం జిల్లా వ్యాప్తంగా శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రువు పాల్గొని రైతులకు నమూనా చెక్కు అందజేశారు. అనకాపల్లిలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్, ఎలమంచిలి మండలం రామారాయుడుపాలెంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి నియోజకవర్గం సబ్బవరంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, చోడవరం నియోజకవర్గం రావికమతంలో ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పాల్గొని రైతులకు నమూనా చెక్కులు అందజేశారు.
జిల్లాలో 2,42,536 మంది రైతులకు లబ్ధి
జిల్లాలో 2,42,536 మంది రైతులకు కూటమి ప్రభుత్వం రూ.161.45 కోట్లు మంజూరు చేసింది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం తొలి విడత కింద రూ.7 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.