Visakhapatnam: రెండున్నర గంటలు పరుగెడుతూనే ఉన్నాం
ABN , Publish Date - Apr 25 , 2025 | 05:45 AM
పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలతో బయటపడ్డ విశాఖ దంపతులు రెడ్డి శశిధర్, సుమిత్రాదేవి తాము రెండున్నర గంటలపాటు పరుగులు తీశామని తెలిపారు. తమ కళ్ల ముందే స్నేహితుడు చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చేశారని వాపోయారు

మా కళ్ల ముందే చంద్రమౌళిని కాల్చేశారు
మమ్మల్ని ఆ దేవుడే కాపాడాడు
‘ఆంధ్రజ్యోతి’తో రెడ్డి శశిధర్, సుమిత్రాదేవి
విశాఖపట్నం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ‘పహల్గాంలో మమ్మల్ని దేవుడే కాపాడాడు. లేకుంటే అక్కడే చనిపోయేవాళ్లం. సుమారు రెండున్నర గంటలు కొండపై నుంచి కిందికి పరుగెడుతూనే ఉన్నాం’. విశాఖ నుంచి కశ్మీర్ పర్యటనకు వెళ్లి పహల్గాం కాల్పుల ఘటనలో ప్రాణాలతో బయటపడిన రెడ్డి శశిధర్, సుమిత్రాదేవి దంపతులు చెప్పిన సంగతులివీ. వీరితో కలిసి ఆ పర్యటనకు వెళ్లిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ చంద్రమౌళి ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. చంద్రమౌళికి వీరు అత్యంత సన్నిహితులు. విశాఖపట్నం లాసన్స్‌బే కాలనీలో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి విశాఖపట్నం చేరుకున్న ఈ దంపతులను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ గురువారం పరామర్శించింది. ఈ సందర్భంగా వారు చెప్పిన వివరాలు వారి మాటల్లోనే...‘మేం మొత్తం పదిమంది కశ్మీర్ పర్యటనకు ఈ నెల 18వ తేదీన వెళ్లాం. 22న పహల్గాం వెళ్లాం.
మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో మేం ఇద్దరం, మరో నలుగురు కలిసి వాష్‌రూమ్‌కు వెళ్లాం. ఆ తర్వాత పది నిమిషాలకే కాల్పుల శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూస్తే సువిశాలమైన కొండపై సుమారుగా 400 మంది పర్యాటకులు అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. వారిని కొందరు తుపాకులతో వెంబడిస్తున్నారు. ఇదేదో ఉగ్రవాద చర్యలా ఉందని వెంటనే పక్కనే ఉన్న ఫెన్సింగ్ కింద నుంచి అటు వైపు దిగిపోయి పరుగెత్తడం ప్రారంభించాం. మాతో పాటు చంద్రమౌళి, ఆయన భార్య నాగమణి కూడా ఉన్నారు. తలా ఒక దిక్కుకు పరుగెత్తి చెట్ల వెనుక దాక్కున్నాం. వెనక్కి తిరిగి చూస్తే చంద్రమౌళిని మోకాళ్ల మీద కూర్చోమంటూ ఓ సాయుధుడు గద్దిస్తున్నాడు. ఆ దృశ్యం చూడలేక కళ్లు మూసుకున్నాం. కొద్దిక్షణాలకే మళ్లీ కాల్పుల శబ్దం వినిపించింది. ప్రాణ భయంతో అక్కడి నుంచి కిందకు పరుగు తీస్తూనే ఉన్నాం. సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువకు చేరుకున్నాం. అక్కడ భారత సైనికులు కనిపించారు. చంద్రమౌళి కాల్పుల్లో చనిపోయారని ఆరోజు రాత్రే మాకు తెలిసింది. కానీ, ఆయన భార్య నాగమణికి చెప్పలేదు.’ అని రెడ్డి శశిధర్, సుమిత్రాదేవి దంపతులు వివరించారు.
బొట్టు కడిగేసుకున్నా
ఉగ్రవాదులు హిందువులనే టార్గెట్ చేశారని, ముస్లింలైతే వదిలేస్తున్నారని మా ఆయన నన్ను బొట్టు చెరిపేసుకోమన్నారు. అక్కడి వాగు నీళ్లతో బొట్టు చెరిగిపోయేలా ముఖం కడిగేసుకున్నా. ఎంతో బాధ అనిపించింది. ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఆ పని చేయక తప్పలేదు.
- సుమిత్రాదేవి
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్