Minister Anita: జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్
ABN , Publish Date - Apr 20 , 2025 | 03:43 AM
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మరో 10 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గోరంట్ల మాధవ్ కేసులో తప్పిదం వల్ల 11 మంది పోలీసులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు

రాష్ట్రంలో కొత్తగా మరో 10 పీఎస్‌లు
మహిళలు, చిన్నారుల భద్రతే ప్రభుత్వ ధ్యేయం: అనిత
గోరంట్ల మాధవ్ విషయంలో పొరపాటు వల్లే 11 మంది సస్పెన్షన్
పల్నాడులోని 40 గ్రామాల్లో ఇంకా ఫ్యాక్షన్ మూలాలు: హోం మంత్రి అనిత
గుంటూరు, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అదనంగా మరో 10 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఇటీవల గుంటూరులో జరిగిన గోరంట్ల మాధవ్ ఘటన నేపథ్యంలో శనివారం ఆమె గుంటూరు రేంజ్ పరిధిలోని ఆయా జిల్లాల ఎస్పీలు ఏఆర్ దామోదర్(ప్రకాశం), తుషార్ డూడీ(బాపట్ల), సతీశ్ కుమార్ (గుంటూరు), కె శ్రీనివాసరావు (పల్నాడు), డీఎస్పీలతో గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ఆమె నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. అనారోగ్య కారణాలతో నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ సమావేశానికి రాలేదు. సమీక్ష అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘పెరుగుతున్న జనాభా ఆధారంగా సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం. డ్యూటీ చేసే పోలీసులకు వసతులు కల్పిస్తాం. దీనిలో భాగంగా సిబ్బంది నివాసాలను దృష్టిలో పెంచుకుని ఇప్పటికే 8 ఎకరాలు కావాలని సీఆర్‌డీఏ అధికారులను కోరాం. మహిళలు, చిన్నారులు, ప్రజల భద్రతే కూటమి ప్రభుత్వ ధ్యేయం. ప్రకాశంలో సైబర్ క్రైం జీరో. సైబర్ క్రైంపై ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించడం వల్లే ఇది సాధ్యమైంది. అదేవిధంగా బాపట్ల ఎస్పీ తుషార్ డూడీ సైబర్ క్రైంపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా కేసుల్లో పెద్ద మొత్తంలో సొత్తు రికవరీ చేసి బాధితులకు అందించారు. పోక్సో కేసులను వేగంగా దర్యాప్తు చేసి శిక్షపడేలా చేస్తున్నామన్నారు.
పోలీసులు, ప్రాసిక్యూషన్ అధికారులు సమ న్వయంతో పని చేయడం వల్లే ఇది సాధ్యమైంది. పోలీసులు ఛేదిస్తున్న కేసుల్లో 70 శాతం సీసీ కెమెరాల ద్వారానే సాధ్యమవుతున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు. ప్రతి జిల్లా ఎస్పీ పరిధిలో 5-10 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయవలసిందిగా లక్ష్యం నిర్దేశించాం. ఇళ్లు, దుకాణాలు, ప్రైవేట్ పాఠశాలల వద్ద కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను కోరుతున్నాం. కోటప్పకొండలో డ్రోన్ వల్లే ఎక్కడా చిన్న ఇబ్బంది రాకుండా నిఘా సాధ్యమైంది. బాపట్ల సూర్యలంకకు ప్రతి శని, ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువైయింది. వారికి ఇబ్బంది కలగకుండా వీకెండ్‌లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ కూడా డ్రోన్‌లతో నిఘా పెంచాం. అంతేగాక ఐజీ, ఎస్పీ సూచనల మేరకు గజ ఈతగాళ్లను గుర్తించి ఎస్డీఆర్‌ఎఫ్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించి రెస్క్యూలో మరిన్ని మెళకువలు నేర్పిస్తాం. మాజీ మంత్రి రోజా వంటి వైసీపీ నాయకుల అసభ్యకర వ్యాఖ్యలు, విమర్శల తీరు వారి సంస్కారానికి నిదర్శనం. పోలీస్ విభాగంలోని సాంకేతిక బృందాలకు మరింత నైపుణ్యమందించి పటిష్ఠంగా మారుస్తాం. ప్రైవేట్ బృందాల సహకారం తీసుకుని సైబర్ నేరాలను నియంత్రిస్తాం.
కానిస్టేబుల్ నుంచి అఽధికారుల వరకు ఎవరికీ పదోన్నతుల విషయంలో అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటాం. కానిస్టేబుళ్ల ప్రమోషన్‌ల విషయంలో నెలకున్న సందిగ్ధతకు కూడా త్వరలోనే తెరదించుతాం. సూపర్ న్యూమరీ పోస్టులపైన కూడా దృష్టి పెడతాం. గత ఐదేళ్లలో పోలీసు రిక్రూట్‌మెంట్ జరగలేదన్నారు. కానిేస్టబుల్ పోస్టులకు సంబంధించి సమస్యలను అధిగమించి 6 వేల మంది నియామకం చేపడుతున్నామన్నారు. ఏ శాఖకు చెందిన వారో కూడా చెప్పకుండా గత ఐదేళ్లు మహిళా పోలీసుల ేసవలు వినియోగించుకున్నారు. వాటిని సరిచేస్తాం. గోరంట్ల మాధవ్ విషయంలో పోలీసుల పొరపాటు ఉండటం వల్లే 11 మందిని సస్పెండ్ చేశాం. భవిష్యత్తులో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికే సమీక్షా సమావేశం నిర్వహించాం. వైసీపీ నాయకులు పోలీసులను కూడా బెదిరించి అప్పర్ హ్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఏ ఆడపిల్లను వేధించినా, దూషించినా కూటమి ప్రభుత్వం ఒకేలా స్పందిస్తుంది. పల్నాడు ప్రాంతంలో ఇంకా ఫ్యాక్షన్ మూలాలు ఉన్నాయి. మూలాలు ఉన్న 40 గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాం’ అని అనిత తెలిపారు.