AP Police: విధి నిర్వహణలో వెంటాడిన మృత్యువు
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:49 AM
ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసులను బలితీసుకుంది.

కోదాడలో లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు
ఏపీకి చెందిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ దుర్మరణం
కోదాడ, ఆలమూరు, నరసాపురం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసులను బలితీసుకుంది. విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో ముందున్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఏపీకి చెందిన ఓ ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. మరో కానిస్టేబుల్, వాహన డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. కోదాడ సీఐ కథనం ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన గంజాయి కేసుల నిందితుల కోసం ఎస్‌ఐ ముద్దాల అశోక్(46), ఆత్రేయపురం పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ బ్లెస్సన్ జీవన్(32), రావులపాలెం కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యస్వామి ఒక బృందంగా ఏర్పడి ఓ ప్రైవేటు వాహనంలో బుధవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరారు. రమేష్ అనే వ్యక్తి వాహనాన్ని నడుపుతుండగా.. ఎస్‌ఐ డ్రైవర్ పక్క సీటులో, జీవన్, సుబ్రహ్మణ్యస్వామి వెనక సీట్లలో ఉన్నారు. గురువారం తెల్లవారుజాము 2.45 గంటలకు చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద వాహనాన్ని ఆపి గంట సేపు విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి బయలుదేరిన వీరు 4.15 గంటలకు కోదాడ సమీపంలోని దుర్గాపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
వీరి ముందు రోడ్డుకు ఎడమ వైపు వేగంగా వెళుతున్న ఓ లారీ ఒక్కసారిగా కుడివైపునకు దూసుకురాగా.. పోలీసు వాహనం ఆ లారీని బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కారులో ఇరుక్కున్న వారిని బయటికి తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ అశోక్, కానిస్టేబుల్ జీవన్ మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, 2009లో ఎస్‌ఐగా ఉద్యోగంలో చేరిన అశోక్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కానిస్టేబుల్ జీవన్ అవివాహితుడు. ఎస్‌ఐ అశోక్ అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ప్రభుత్వ విప్ నాయకర్, కోనసీమ ఎస్పీ కృష్ణారావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీఎస్పీ మురళీకృష్ణ, ఆశోక్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అశోక్ నివాసం నుంచి గోదావరి ఒడ్డు వరకు నిర్వహించిన అంతిమ యాత్రలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.