Tirumala Darshanam: తిరుమల కిటకిట
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:09 AM
వేసవి రద్దీతో తిరుమలలో భక్తులు భారీగా తరలివచ్చారు, సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.క్యూకాంప్లెక్స్‌లు, షెడ్లు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం దాకా విస్తరించింది

సర్వదర్శనానికి 15 గంటలు
తిరుమల, ఏప్రిల్20(ఆంధ్రజ్యోతి): వేసవి రద్దీతో తిరుమల కిటకిటలాడుతోంది. వారాంతం కూడా తోడవడంతో శని, ఆదివారాల్లో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 31 కంపార్టుమెంట్ల్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లూ సర్వదర్శన భక్తులతో నిండిపోయి, క్యూలైన్ కృష్ణతేజ మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం వరకు వ్యాపించింది. మధ్యాహ్నం 4 గంటల తర్వాత కొంత తగ్గి ఏటీసీ సర్కిల్ వరకు వచ్చింది. వీరి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇక స్లాటెడ్ టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులకు కూడా మూడు గంటల సమయం పడుతోంది. మరోవైపు శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, లడ్డూ కేంద్రం, అఖిలాండం, అన్నప్రసాద భవనం, సీఆర్వో, లేపాక్షి, ఎంబీసీ వంటి ప్రాంతాలన్నీ భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదివారం నారాయణగిరి షెడ్లను తనిఖీ చేశారు. రాత్రి సర్వదర్శన క్యూలైన్లను పరిశీలించారు. శ్రీవారి దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శన క్యూలైన్‌లోకి ప్రవేశించాలని వెంకయ్య చౌదరి ఈసందర్భంగా కోరారు.