Tirumala Devotees Fight: తిరుమల నారాయణగిరి షెడ్లలో భక్తుల ఘర్షణ
ABN , Publish Date - May 19 , 2025 | 05:03 AM
తిరుమల నారాయణగిరి షెడ్లలో రెండు కుటుంబాల మధ్య గొడవ కారణంగా మహిళలు జుట్టు పట్టుకుని గొడవపడ్డారు. ఈ ఘర్షణ సమయంలో జరిగిన సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్
తిరుమల, మే 18 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే నారాయణగిరి షెడ్లలో ఆదివారం భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జుట్లు పట్టుకొని మరీ ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నిద్రపోతున్న సమయంలో ఓ మహిళ మరో మహిళపై కాలు వేసిందనే కారణంతో నారాయణగిరి ఉద్యానవనంలోని 8వ నంబరు షెడ్‌లో ఆదివారం వేకువజాము 3.30 గంటల సమయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. మాటమాట పెరగడంతో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కిందపడి మరీ కొట్టుకున్నారు. పురుషులు కూడా ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. తోటిభక్తులు ఎవరూ పట్టించుకోకపోవడంతో వివాదం పెరిగిపోయింది. సమీపంలోని ఓ సెక్యూరిటీ గార్డు గొడవను గుర్తించి లోపలకు వెళ్లి వారికి సర్దిచెప్పి దర్శనానికి పంపారు. ఈ వివాదానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శనానికి వెళ్లే సమయంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ఈ నెలలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం.