YS Vivekananda Case: అవినాశ్‌రెడ్డి బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:29 AM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సునీతారెడ్డి సుప్రీంకోర్టును కోరారు. ఆయన బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, సాక్షులను బెదిరిస్తారని సీనియర్ న్యాయవాది లూథ్రా వాదించారు

ఇద్దరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని కేసును తప్పుదారి పట్టించాలని చూశారు
రాంసింగ్, సునీత దంపతులపై అన్యాయంగా కేసులు.. వైసీపీ ఎంపీ బెయిల్ రద్దుచేయండి
సుప్రీంకు సీనియర్ న్యాయవాది లూథ్రా వినతి.. సునీతారెడ్డి వ్యాజ్యాలపై విచారణ జూలై చివరి వారానికి వాయిదా.. అప్పటికి తాను రిటైరవుతానన్న సీజేఐ
పిటిషన్లను మరో ధర్మాసనానికి మార్చాలని రిజిస్ట్రీకి సూచన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఆయన బయటే ఉంటే కేసును ప్రభావితం చేస్తారని ఆమె తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తన తండ్రి హత్య కేసులో నిందితులు అవినాశ్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిల బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాలను మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలుచేసిన అదనపు అఫిడవిట్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలని అవినాశ్‌రెడ్డి తరఫు న్యాయవాది కోరారు. దీనిపై లూథ్రా అభ్యంతరం తెలిపారు.
ఇప్పటికే ఏళ్ల తరబడి కేసుపై వాదనలు జరుగుతున్నాయని.. అవినాశ్‌రెడ్డే ఇద్దరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని కేసును తప్పుదారి పట్టించాలని చూశారని, అన్యాయంగా రాంసింగ్, సునీత దంపతులపై కేసులు పెట్టారని వివరించారు. అవినాశ్‌రెడ్డి బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, సాక్షులను బెదిరిస్తారని చెప్పడానికి ఇదే నిదర్శనమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను జూలై చివరి వారానికి వాయిదా వేసింది. అయితే.. వచ్చే వాయిదా తేదీకి తాను పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ కేసును మరో ధర్మాసనానికి మార్చాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సూచించారు.
ఇవి కూడా చదవండి
AP Govt: ‘వేస్ట్ మేనేజ్‌మెంట్’పై కీలక ఒప్పందం
Gorantla Madhav: ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకొంటున్న ప్రజలు
Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
For More AP News and Telugu News