Summer Conditions: మళ్లీ మందగించిన రుతుపవనాలు
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:33 AM
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ పూర్తిగా మందగించాయి. ఎండాకాలం తరహాలో వేడిగాలులు, ఉక్కపోతతోపాటు పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.

హిందూ మహాసముద్రం నుంచి తగ్గిన తేమగాలుల రాక
ఏపీ, తమిళనాడుల్లో వేసవి పరిస్థితులు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో వేసవి పరిస్థితులు
విశాఖపట్నం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ పూర్తిగా మందగించాయి. ఎండాకాలం తరహాలో వేడిగాలులు, ఉక్కపోతతోపాటు పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని పలుచోట్ల పిడుగులు, ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి తప్ప రుతుపవనాల ప్రభావం లేదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. నాలుగైదు రోజుల నుంచి మధ్య, తూర్పు, వాయవ్య భారతంలో రుతుపవనాలు విస్తరించాయి. దానికి అనుకూలంగా బిహార్, ఉత్తరప్రదేశ్‌లో అల్పపీడనం కొనసాగుతోంది.
బంగాళాఖాతం నుంచి తేమగాలులు మధ్యభారతం మీదుగా వీస్తుండంగా.. మధ్య, తూర్పు, వాయవ్య, పశ్చిమ భారతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో అనేకచోట్ల రుతుపవనాలు మందగించడంతో వేసవి పరిస్థితులు నెలకొన్నాయి. రుతుపవనాలకు బలం చేకూరేలా హిందూ మహా సముద్రంలో మేడిన్ జూలియన్ ఆసిలేషన్ (ఎంజేవో) రెండు వారాల నుంచి బలహీనంగా ఉంది. హిందూ మహాసముద్రం నుంచి తేమగాలుల రాక తగ్గి, రుతుపవనాలు దక్షిణ భారతంలో పెద్దగా ప్రభావం చూపడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వచ్చే నెలలో చాలా రోజుల వరకు హిందూ మహా సముద్రంలో రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం పెద్దగా బలపడకపోవచ్చని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. కాగా.. ఈ నెల 25 నాటికి పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరిస్తుందని, అల్పపీడనం ఏర్పడుతుందని నిపుణులు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావంతో మెట్టపంటలు సాగుచేసే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.