Share News

Srisailam Cavity Fix: శీశైలం ప్లంజ్‌పూల్‌ వద్ద భారీగొయ్యి పూడ్చివేతపై అధ్యయనం

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:28 AM

శ్రీశైలం ప్లంజ్‌పూల్‌ వద్ద ఏర్పడిన గొయ్యి పూడ్చివేతకు అవసరమైన పద్ధతులపై అధ్యయన బాధ్యతను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీకి అప్పగించారు. ఈ నెల 28, 29 తేదీలలో జాతీయ డ్యాం సేఫ్టీ బృందం పరిశీలన చేపట్టి తుది చర్యలు నిర్ణయించనుంది.

Srisailam Cavity Fix: శీశైలం ప్లంజ్‌పూల్‌ వద్ద భారీగొయ్యి పూడ్చివేతపై అధ్యయనం

  • నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీకి బాధ్యత

  • జలవనరుల శాఖ ఉత్తర్వులు

  • 28న రానున్న జాతీయ డ్యాం సేఫ్టీ బృందం

  • 29న ప్లంజ్‌పూల్‌ పరిశీలన

అమరావతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం ప్లంజ్‌పూల్‌ వద్ద ఏర్పడిన భారీ గొయ్యిని పూడ్చేందుకు పాటించాల్సిన మెథడాలజీపై అధ్యయన బాధ్యతను కేంద్ర సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీకి ప్రభుత్వం అప్పగించింది. అధ్యయన సమయంలో వీడియో రికార్డింగ్‌ చేయాల్సి ఉందని కర్నూలు జల వనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ తెలియజేయగా.. పరిగణనలోకి తీసుకున్న జలవనరుల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.51 లక్షలు చెల్లించనున్నట్లు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ గురువారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2009 వరదల సమయంలో ఏర్పడిన ఈ గొయ్యి డ్యాంకే ప్రమాదంగా మారుతుందని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని జాతీయ జలాశయ భద్రత సంస్థను కోరుతున్నాయి. ఆ సంస్థ దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చింది. గొయ్యితో ముప్పు పొంచి ఉందని జాతీయ పరిశోధనా సంస్థలు, నిపుణులు ఇటీవల కేంద్రానికి హెచ్చరికలు చేశారు. దీంతో ఈ నెల 28న ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌ అనిల్‌జైన్‌ బృందం విజయవాడ రానుంది. 29న శ్రీశైలం వెళ్లి ఆ గొయ్యిని పరిశీలిస్తుంది. ఇంజనీరింగ్‌ అధికారులతో భేటీ అవుతుం ది. 30వ తేదీన తెలంగాణ అధికారులతో సమావేశమవుతుంది. ఆ తర్వాత గొయ్యి పూడ్చివేతకు అనుసరించాల్సిన పద్ధతి, అంచనా వ్యయంపై నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు.

Updated Date - Apr 18 , 2025 | 04:28 AM