Statewide Yoga Celebrations: వైభవంగా యోగా
ABN , Publish Date - Jun 22 , 2025 | 05:21 AM
రాష్ట్ర వ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వైభవంగా జరిగింది. పెద్దల నుంచి పిన్నల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ‘యోగాంధ్ర’కు వన్నెతెచ్చారు

రాష్ట్రవ్యాప్తంగా ఆసనాలు
చిన్నా పెద్దా సందడే సందడి
(ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్): రాష్ట్ర వ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వైభవంగా జరిగింది. పెద్దల నుంచి పిన్నల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ‘యోగాంధ్ర’కు వన్నెతెచ్చారు. శనివారం రాష్ట్రంలోని హైకోర్టు నుంచి పాఠశాలల వరకు, అసెంబ్లీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు ‘యోగా ముద్ర’ను సంతరించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 61,266 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు యోగాసనాలు వేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు దాదాపు 60 లక్షల మంది యోగాసనాలు వేసి రికార్డును నెలకొల్పడంలో భాగమయ్యారని సమగ్ర శిక్ష అభియాన్ సంచాలకుడు బి. శ్రీనివాసరావు తెలిపారు.
విజయవాడలో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఉద్యోగులు యోగా సాధన చేశారు. గుంటూరు జిల్లా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగులు ఆసనాలువేశారు.
అమరావతి సచివాలయ ప్రాంగణంలో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు యోగాసనాలు వేశారు.
శాసనసభ ప్రాంగణంలో సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర ఆధ్వర్యంలో ఉద్యోగులు పలు రకాల ఆసనాలు వేశారు.
మంగళగిరి టీడీపీ కార్యాలయంలో విట్‌ప్రొఫెసర్ అగమ్ గోస్వామి,పెండ్యాల యామిని ఆధ్వర్యంలో నేతలు, విద్యార్థులు, సిబ్బంది యోగసనాలు వేశారు.
నెల్లూరులోని ఏసీ స్టేడియంలో యోగా కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. మంత్రి ఆనం ఆనం గార్డెన్స్‌లో ఆసనాలు వేశారు.
‘విశేష’ యోగా!
తిరుపతి ఎన్‌సీసీ నగర్‌లో ఎన్‌సీసీ క్యాడెట్లు గుర్రాలపై కూర్చుని, నిలబడి యోగాసనాలు వేశారు. వారిని కల్నల్ సతీందర్ దహియా ప్రశంసించారు.
శ్రీకాకుళం జిల్లా గార మండలం సెగిడిపేట గ్రామానికి చెందిన ఉపాధి శ్రామికురాలు, 62 ఏళ్ల కలగ దాలమ్మ ఈ నెల 16న శ్రీకూర్మంలో మహిళలతో కలిసి యోగా సాధన చేశారు. శనివారం విశాఖలో సీఎం చంద్రబాబుకు మంత్రి అచ్చెన్న ఆమె ఫొటోను చూపించగా, దానిని మీడియాకు చూపించి సీఎం ప్రశంసించారు.
రాజమండ్రి జైలులో 1300 మంది ఖైదీలు యోగాసనాలు వేశారు.