Share News

Minister Atchannaidu: ఉచిత బస్సులో రాష్ట్రమంతా తిరగొచ్చు

ABN , Publish Date - Jul 27 , 2025 | 04:42 AM

మహిళలు రాష్ట్రమంతటా ప్రయాణించేలా ఉచిత బస్సు పథకానికి రూపకల్పన జరుగుతోందని మంత్రి అచ్చెనాయుడు వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలవుతుందని గుర్తుచేశారు.

Minister Atchannaidu: ఉచిత బస్సులో రాష్ట్రమంతా తిరగొచ్చు

  • ప్రత్యేకంగా ఐదు రకాల బస్సులు

  • ఆటోడ్రైవర్లకు ప్రత్యేక పథకం.. త్వరలో వివరాలు

  • మంత్రి లోకేశ్‌ చొరవతోనే: మంత్రి అచ్చెనాయుడు

అన్నవరం, జూలై 26(ఆంధ్రజ్యోతి): మహిళలు రాష్ట్రమంతటా ప్రయాణించేలా ఉచిత బస్సు పథకానికి రూపకల్పన జరుగుతోందని మంత్రి అచ్చెనాయుడు వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలవుతుందని గుర్తుచేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అన్నవరంలో శనివారం జరిగిన ‘సుపరిపాలన-తొలిఅడుగు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఆర్టీసీ అధికారులతో తాను, మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యామన్నారు. ఆ సందర్భంలో, రాష్ట్ర మహిళలు పనిలేకుండా ప్రయాణించరని, దానికి అనుగుణంగా ఉచిత ప్రయాణం జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రమంతా అమలు చేయాలని లోకేశ్‌ ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు ఐదు రకాల బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. అదే సమయంలో ఆటోడ్రైవర్లు ఇబ్బంది పడకుండా వారికి ప్రత్యేక పథకం అమలు చేస్తామని, దాన్ని త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల బాధితులకు సీఎం సహాయనిధి ద్వారా ఇస్తున్న సాయంలో అధికశాతం నాటి ప్రభుత్వంలో నాసిరకం మద్యం తాగి కిడ్నీ, లివర్‌ పాడైన కేసులు ఉన్నాయని తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద 54లక్షల మంది రైతులకు మూడు విడతల్లో కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు అందజేస్తామన్నారు. పరిశ్రమల స్థాపన కోసం సీఎం అహర్నిశలూ కష్టపడుతున్నా, కొందరు పారిశ్రామికవేత్తలు ‘మీ రాష్ట్రంలో అవినీతి భూతం ఉందని, అది ఉంటే తాము రాలేమ’ని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం, మరోసారి ఆ భూతం రాకుండా తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రజల చేతిలోనే ఉందని అచ్చెన్న అన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 04:44 AM