Student suside: ఎందుకురా ఇలా చేశావు?
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:32 AM
Polytechnic student commits suicide ఆ విద్యార్థి పాలిటెక్నిక్ డిప్లమో చదువుతున్నాడు. ఆ చదువు పూర్తయితే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. కానీ చదువు అంటేనే ఇష్టం లేదని ఆ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పాడు. చదువుకుంటేనే భవిష్యత్ ఉంటుందని వారు నచ్చజెప్పారు. దీంతో మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చాడు.

చదువు ఇష్టం లేకపోతే.. చనిపోవాలా?
రైలు కిందపడి పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య
ఆమదాలవలస, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ఆ విద్యార్థి పాలిటెక్నిక్ డిప్లమో చదువుతున్నాడు. ఆ చదువు పూర్తయితే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. కానీ చదువు అంటేనే ఇష్టం లేదని ఆ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పాడు. చదువుకుంటేనే భవిష్యత్ ఉంటుందని వారు నచ్చజెప్పారు. దీంతో మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చాడు. ఈ ఘటనకు సంబంధించి శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన దేవల హేమంత్(16) అనే విద్యార్థి చదువు ఇష్టం లేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో విజయనగరం నుంచి భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. హేమంత్‌ను తన తండ్రి మణిభూషణరావు.. దన్నానపేట వద్ద ఉన్న ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గత నెలలో డిప్లమో మొదటి సంవత్సరంలో చేర్పించారు. హేమంత్.. పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటూ, పట్టణంలోని బీసీ వసతిగృహంలో గత కొద్దిరోజుల నుంచి ఉంటున్నాడు. చదువుపై ఆసక్తి లేక, ఆమదాలవలసలో ఉండడం ఇష్టం లేక మూడు రోజుల కిందట స్వగ్రామమైన మందరాడకు వెళ్లిపోయాడు. తనకు చదువుపై ఆసక్తి లేదని తల్లిదండ్రులకు చెప్పాడు. కాగా.. చదువుకుంటేనే భవిష్యత్ బాగుంటుందని వారు నచ్చజెప్పి.. ఆమదాలవలసలో హాస్టల్‌కు శుక్రవారం తీసుకువచ్చారు. దీంతో హేమంత్ మనస్థాపం చెంది.. శనివారం తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన హేమంత్‌ను రైల్వేపోలీసులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని, ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.