Share News

Pudilanka: పర్యాటకం దిశగా.. పూడిలంక తీరం

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:53 AM

Pudi Lanka.. tourism devolpment వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆ ఊరి ప్రజలు గజగజ వణికిపోతారు. రోజుల తరబడి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయి.. చుట్టూ ఉప్పుటేరు మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీసేవారు. కానీ ఇటీవల ఆ గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్‌ ప్రకటించడంతో.. ఆ ప్రాంతవాసుల్లో భయం స్థానంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Pudilanka: పర్యాటకం దిశగా.. పూడిలంక తీరం
పూడిలంకలో ఉప్పుటేరుపై స్థానికుల పడవ ప్రయాణం(ఫైల్‌)

  • అభివృద్ధి చేస్తే చిలుక సరస్సుగా మారే అవకాశం

  • పెరగనున్న ఉపాధి మార్గాలు

  • కలెక్టర్‌ ప్రకటనపై స్థానికుల్లో సంతోషం

  • వజ్రపుకొత్తూరు, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆ ఊరి ప్రజలు గజగజ వణికిపోతారు. రోజుల తరబడి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయి.. చుట్టూ ఉప్పుటేరు మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీసేవారు. కానీ ఇటీవల ఆ గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్‌ ప్రకటించడంతో.. ఆ ప్రాంతవాసుల్లో భయం స్థానంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. వజ్రపుకొత్తూరు మండలంలోని పూడిలంక తీరం చుట్టూ సువిశాలమైన ఉప్పుటేరు. మధ్యలో చిన్నకొండపైన కుగ్రామం. ఉప్పుటేరుపై పడవతో షికారు చేస్తే ఆ అనుభూతి చెప్పలేం. కాగా.. ఇప్పటివరకు పూడిలంక గ్రామం పేరు చెబితే.. తుఫాన్ల సమయంలో గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులు, అధికారుల హడావిడి కనిపించేవి. కానీ పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఎవ్వరు చేయలేదు. ఇటీవల పూడిలంకలో వంతెన నిర్మాణం భూమిపూజ కోసం మంత్రి అచ్చెన్నతో వచ్చిన కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌.. ఇక్కడ వాతావరణాన్ని చూసి ముగ్ధులయ్యారు. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వనరులు అధికంగా ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. పర్యాటకాభివృద్ధి దిశగా ఆలోచన చేస్తానని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రకృతి అందాలు మెండుగా ఉన్న పూడిలంకను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఒడిశాలో చిలుక సరస్సుగా ధీటుగా ఉంటుంది. రోడ్డుకు ఇటువైపు పచ్చని చెట్లు, అటు సువిశాలమై ఉప్పుటేరు కేరళను తలపిస్తుంది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే మత్స్యకారులకు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.నాలుగు కోట్లతో పూడిలంకకు వంతెనతో కూడిన రోడ్డు మార్గాన్ని నిర్మించనుంది. ఈ నేపథ్యంలో పర్యాటకులు పెరిగే అవకాశం ఉంది. దీనికితోడు పక్కనే ఉన్న సముద్రం.. పర్యాటకులను మరింత ఆకట్టుకోనుంది. కలెక్టర్‌ ఆలోచన కార్యరూపం దాల్చేలా పర్యాటకశాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

  • ఎంతో అనువైనది..

  • పూడిలంక ప్రాంతం పర్యాటకాభివృద్ధిపై కలెక్టరు మాట్లాడడం ఆనందంగా ఉంది. ఈ ప్రాంతం పర్యాటకాన్ని ఎంతో అనువైనది. ఇక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేస్తే.. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి.

    - లండవాసు, పల్లివూరు

Updated Date - Aug 02 , 2025 | 12:53 AM