Share News

pinchans: ఎదురు చూడకుండానే..

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:45 PM

Women welfare రాష్ట్ర ప్రభుత్వం వితంతువులకు మే నెల నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీచేసి.. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వంలో పింఛన్లు పొందేందుకు అర్హులు అనేక ఇబ్బందులు పడేవారు.

pinchans: ఎదురు చూడకుండానే..
పరశురాంపురం సచివాలయంలో వితంతువు పింఛన్‌ కోసం దరఖాస్తు(ఫైల్‌)

  • వితంతు పింఛన్ల మంజూరుకు చర్యలు

  • సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ

  • జిల్లాలో 4,623 మందికి వచ్చే అవకాశం

  • మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి ఎస్‌.కృష్ణమూర్తి వృద్ధాప్య పింఛన్‌ పొందేవాడు. ఆయన గతేడాది జనవరిలో మృతి చెందాడు. దీంతో కృష్ణమూర్తి భార్య కాంతమ్మ పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంత వరకు రాలేదు. అయితే, పింఛన్‌ తీసుకునే భర్త మృతి చెందితే అతని భార్యకు తక్షణమే వితంతువు పింఛన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కృష్ణమూర్తి భార్య కాంతమ్మకు పింఛన్‌ వచ్చే అవకాశం ఉంది.

  • ...........

  • మెళియాపుట్టి మండలం పరశురాంపుం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ 2023 డిసెంబరులో మృతి చెందాడు. ఆయన భార్య వరహాలు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. రెండేళ్లవుతున్నా ఇంకా మంజూరు కాకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తాజా చర్యలతో ఆమెకు పింఛన్‌అందనుంది.

  • మెళియాపుట్టి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వితంతువులకు మే నెల నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీచేసి.. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వంలో పింఛన్లు పొందేందుకు అర్హులు అనేక ఇబ్బందులు పడేవారు. అన్ని ధ్రువపత్రాలు ఇచ్చినప్పటికీ వారికి పింఛన్లు మంజూరయ్యేవి కావు. సచివాలయాలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం శూన్యం. టీడీపీ ప్రభుత్వ హయాంలో వితంతువు పింఛన్ల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగేది. వైసీపీ ప్రభుత్వం ఈ ఆనవాయితీకి బ్రేక్‌ వేసి.. ఆరు నెలలకోసారి దరఖాస్తులు పరిగణనలోకి తీసుకుని పింఛన్లు మంజూరు చేసేది. 2003 డిసెంబరు నుంచి కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిపేసింది. దీంతో చాలామంది పింఛన్ల కోసం ఎదురుచూస్తూ.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ముందుగా వితంతువులకు పింఛన్లు మంజూరు చేయనుంది. ఈ మేరకు 2023 డిసెంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 లోపు వృద్ధాప్య పింఛన్లు తీసుకుంటూ మృతిచెందిన వారి భార్యలు పింఛన్ల కోసం సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని పంచాయతీరాజ్‌శాఖ ఆదేశాలు జారీచేసింది. ఉమ్మడి జిల్లాలో ఇలా చనిపోయినవారు 4,623 మంది ఉన్నారు. వీరి భార్యలందరికీ వితంతువు పింఛన్లు మంజూరు చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా దశల వారీగా కొత్త పింఛన్లు ఇవ్వడానికి కేబినెట్‌లో ఇటీవల తీర్మానం చేశారు. ముందుగా 2023 డిసెంబరు నుంచి 2024 అక్టోబరు వరకు 11 నెలలకు సంబంధించి పెండింగ్‌ దరఖాస్తులు పరిశీలించి పింఛన్లు ఇవ్వనున్నారు. దీనివల్ల జిల్లాకు సంబంధించి ప్రతినెలా రూ.18.49కోట్లు అదనపు భారం ప్రభుత్వంపై పడనుందని అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఎట్టకేలకు పింఛన్లు వస్తుండడంతో పేదల కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది.

  • దరఖాస్తులు ఇవ్వాలి

    2023 డిసెంబరు- 2024 అక్టోబరు మధ్యలో వృద్ధాప్య పింఛన్లు తీసుకున్న వ్యక్తులు మృతి చెందితే వారి భార్యలు సచివాలయాల్లో దరఖాస్తులు ఇవ్వాలి. గతంలో దరఖాస్తు చేసినా మరోసారి ఇవ్వాలి. వాటిని పరిశీలించి పింఛన్లు మంజూరు చేస్తాం.

    - ప్రసాద్‌పండా, ఎంపీడీవో, మెళియాపుట్టి

Updated Date - Apr 28 , 2025 | 11:45 PM