policet: రేపు 39 కేంద్రాల్లో పాలిసెట్
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:42 PM
Polytechnic Common Entrance Test పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికిగానూ ఈ నెల 30న జిల్లాలో 39 కేంద్రాల్లో పాలిసెట్ నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ జె.సత్యనారాయణమూర్తి తెలిపారు.

ఎచ్చెర్ల, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికిగానూ ఈ నెల 30న జిల్లాలో 39 కేంద్రాల్లో పాలిసెట్ నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ జె.సత్యనారాయణమూర్తి తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (కుశాలపురం)లో సోమవారం పాలిసెట్ నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ‘జిల్లాలో శ్రీకాకుళం సమన్వయ కేంద్రం పరిధిలో 25, టెక్కలి పరిధిలో 14 కేంద్రాలు ఏర్పాటు చేశాం శ్రీకాకుళం పరిధిలో 6,953 మంది, టెక్కలి పరిధిలో 4,500 మంది పరీక్ష రాయనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ఉదయం 9 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తాం. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బాల్ పెన్ను, హెచ్‌బీ పెన్సిల్, రబ్బరు, షార్ప్‌నర్‌ను తీసుకురావాలి. ఓఎంఆర్ షీటులో ఆన్సర్‌లను హెబీ పెన్సిల్‌తో బబ్లింగ్ చేయాలి. దరఖాస్తు చేసినప్పటికీ ఫీజు ప్రొసెసింగ్ జరగని విద్యార్థులు సమన్వయ కేంద్రాన్ని మంగళ వారం సాయంత్రం 5 గంటల్లోకి సంప్రదించి.. తగిన ఫీజు చెల్లించి హాల్‌టికెట్ పొందవచ్చు’ అని తెలిపారు. పరీక్షల నిర్వహణకుగాను శ్రీకాకుళం కోర్డినేటర్ డాక్టర్ బి.జానకిరామయ్య (శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల), టెక్కలి కోఆర్డినేటర్‌గా డాక్టర్ ఎల్.విజయలక్ష్మి (చీపురుపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల) వ్యవహరించనున్నట్టు వివరించారు.