Share News

Sand smugglimg: కప్పెయ్‌.. దోచెయ్‌

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:57 AM

Sand mining by dumping soil on the canal ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని కొంతమంది నాయకులు అభాసుపాలు చేస్తున్నారు. వారి కనుసన్నల్లోనే దళారులు ఇసుక క్వారీల్లోకి ప్రవేశించి దోపిడీకి తెగబడుతున్నారు.

Sand smugglimg: కప్పెయ్‌.. దోచెయ్‌
మహాలక్ష్మిపురం సమీపంలో వంశధార నదిలో యంత్రంతో ఇసుక తవ్వకాలు, కాలువను కప్పేసి ఏర్పాటు చేసిన రహదారి (ఇన్‌సెట్‌లో)

  • కాలువ మీద మట్టివేసి ఇసుక దోపిడీ

  • వంశధార నదిలో అక్రమంగా తవ్వకాలు

  • అధికార అండతో ఇష్టారాజ్యంగా..

  • గొట్టా బ్యారేజీకి 3 కి.మీ. దూరంలో..

  • ముప్పు పొంచిఉందని ఆందోళనలు

  • క్వారీకి అడ్డగోలుగా అనుమతులు

  • తమకు సంబంధం లేదంటున్న మైనింగ్‌

  • ఇరిగేషన్‌శాఖ అధికారులదేనని స్పష్టం

  • ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని కొంతమంది నాయకులు అభాసుపాలు చేస్తున్నారు. వారి కనుసన్నల్లోనే దళారులు ఇసుక క్వారీల్లోకి ప్రవేశించి దోపిడీకి తెగబడుతున్నారు. కొంతమంది అధికారులు కూడా సహకరిస్తూ అడ్డగోలు అనుమతులు ఇవ్వడంతో.. వంశధార నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. కాలువను సైతం కప్పేసి.. లారీల్లో ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించి కోట్లాది రూపాయలు అర్జిస్తున్నారు.

  • హిరమండలం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): వంశధార నదీ పరివాహక ప్రాంతమైన పాతపట్నం నియోజకవర్గం.. ఇసుక క్వారీలకు నిలయంగా మారింది. ఇక్కడ నాణ్యమైన ఇసుక లభిస్తుండడంతో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. జిల్లాతోపాటు ఇతర జిల్లాలవాసులు కూడా ఇక్కడ నుంచి ఇసుకను తరలించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలో రాష్ట్రస్థాయి నుంచి మండలస్థాయి నేతల కన్ను ఇక్కడ ఇసుక దందాపై పడుతోంది. రాజకీయ, అధికార బలం ఉంటే చాలు.. క్వారీలకు నామమాత్రపు అనుమతి తీసుకువస్తున్నారు. ఆపై ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసి.. యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. లారీల ద్వారా ఇసుక తరలించేందుకు హిరమండలంలోని వంశధార ఎడమ కాలువకు అనుసంధానంగా ఉన్న పిల్ల కాలువను కూడా కప్పేశారు. కాలువలో నీటి ప్రవాహానికి చిన్నపైపును అమర్చారు. పైన గ్రావెల్‌ వేసి లారీలు వెళ్లేందుకు అనువుగా కాలువతోపాటు పొలాల్లో సైతం గ్రావెల్‌తో రహదారిని ఏర్పాటు చేశారు. కాలువ కప్పేయడంతో నీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు నదుల్లో జూన్‌ 1 నుంచి అక్టోబరు 15వరకు ఇసుక తవ్వకాలపై నిషేధం విధించారు. నిల్వ కేంద్రాల్లోనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ నిబంధనలకు విరుద్ధంగా వంశధార నదిలో ఇసుక తవ్వకాలు చేపడుతుండడం చర్చనీయాంశంగా మారింది.

  • హిరమండలం మండలం మహాలక్ష్మిపురం గ్రామం సమీపంలోని వంశధార నదీ గర్భంలో ఇటీవల ఇసుక క్వారీకి మైనింగ్‌, ఇరిగేషన్‌ అధికారులు విశాఖపట్నానికి చెందిన ఇయాన్‌ గ్రూప్‌నకు అనుమతిచ్చారు. ఈ క్వారీని కొద్దిరోజుల కిందటే ప్రారంభించారు. ఈ క్వారీకి ఇచ్చిన అనుమతులపై స్థానికుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతి పత్రంలో ఉచిత ఇసుక విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భగీరథపురం గ్రామం వద్ద స్టాక్‌ పాయింట్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాగే డీసిల్టేషన్‌ (ఇసుక మేటలు)పాయింట్‌ ఏర్పాటుకు అనుమతులిచ్చినా.. ఇసుక తవ్వకాలు ఎక్కడ చేపట్టాలన్నది స్పష్టంగా పేర్కొనలేదు. వంశధార నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తున్నట్టు కూడా ఆర్డర్‌ కాపీలో ప్రస్తావించలేదు. ఈ ఇసుక క్వారీ నిర్వహణపై ఇరిగేషన్‌ ఎస్‌ఈ సుధాకర్‌ వద్ద ప్రస్తావించగా.. ‘ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్షాకాలంలో ఇసుక రీచ్‌లో తవ్వకాలు జరపకూడదు. వంశధార నదిలో డీసిల్టేషన్‌ తొలగింపు కోసం ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చామ’ని తెలిపారు. ఇసుక తవ్వకాలకు అనుమతి పత్రంలో ఎక్కడా వంశధార నది ప్రస్తావన లేదని ఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్లగా, ఆ ఆర్డర్‌ కాపీ వాట్సాప్‌లో పంపిస్తే చూస్తామనడం గమనార్హం. కాగా ప్రస్తుతం నదిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో ఇప్పటికే అక్రమ ఇసుక క్వారీలతో పెద్దపెద్ద గోతులు ఏర్పడి లోతట్టుగా మారింది. ఇసుక మేటలు చూద్దామన్నా కనిపించే పరిస్థితి లేదు. ఇప్పటికే భగీరథపురం వైపు అక్రమ ఇసుక తవ్వకాల వలన నదీ గమనం మారి భగీరథపురం, మహాలక్ష్మిపురం, పిండ్రువాడ, అక్కరాపల్లి గ్రామాల్లోని పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. కొద్దిపాటి వంశధార వరదకే గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈనేపథ్యంలో ఇసుక మేటలు ఉన్నాయంటూ డీసిల్టేషన్‌ పేరుతో తవ్వకాలకు అధికారులు ఎలా అనుమతిచ్చారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.

  • ఈ విషయమై మైనింగ్‌ డీడీ మోహనరావును వివరణ కోరగా ‘ఇసుక రీచ్‌ మంజూరులో నాకు సంబంధం లేదు. ఇరిగేషన్‌ శాఖ అనుమతులు ఇచ్చింది. స్టాక్‌యార్డుల నుంచి కానీ, డీసిల్టేషన్‌ జరిపి మాత్రమే ఇసుక తరలించేందుకు అనుమతులు ఉన్నాయి. వర్షాకాలంలో ఎక్కడా ఇసుక రీచ్‌ల నిర్వహణకు అనుమతులు లేవు’ అని తెలిపారు.

  • గొట్టాబ్యారేజీకి ముప్పు

  • గొట్టాబ్యారేజీ దిగువ ప్రాంతంలో మూడు కిలోమీటర్ల దూరంలో జోరుగా ఇసుక తవ్వకాలు చేపడుతుండడంతో.. బ్యారేజీకి ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే బ్యారేజీ దిగువ భాగం పూర్తిగా దెబ్బతింది. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో క్వారీ ఏర్పాటుకు మైనింగ్‌, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. కానీ గొట్టాబ్యారేజీ భద్రత దృష్ట్యా అనువైన ప్రాంతం కాదని ఆ ఆలోచన విరమించారు. ప్రస్తుతం ఇసుక రీచ్‌ల ఏర్పాటుకు అనుమతులిచ్చారంటూ ఈ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా యంత్రాలతో తవ్వకాలు చేస్తుండడంతో ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు.

  • హఠాత్తుగా వరద వస్తే..

  • ప్రస్తుతం వర్షాకాలం వేళ.. ఇసుకలోడ్‌ చేస్తున్న సమయంలో వంశధార నది హఠాత్తుగా వరద వస్తే యంత్రాలు కొట్టుకుపోతాయి. ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉంది. నదిలో వరద ఉధృతి పెరిగితే.. అధికారులు వెంటనే గొట్టాబ్యారేజీ గేట్లు పైకి ఎత్తేస్తారు. ఆ సమయంలో బ్యారేజీకి మూడుకిలోమీటర్ల దూరంలో ఉన్న ర్యాంపు వద్దకు క్షణాల్లోనే వరద ప్రవాహం చేరి.. ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

  • అనుమతి ఇవ్వలేదు

  • వంశధార పిల్లకాలువను మట్టితో కప్పివేసేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఇసుకు రీచ్‌ నిర్వాహకులు కాలువపై కల్వర్టు కడతామంటే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పాం. ఇంతవరకు దరఖాస్తు అందలేదు.

    - ధనుంజయ, గొట్టాబ్యారేజీ ఏఈ

Updated Date - Aug 02 , 2025 | 12:57 AM