Share News

Police department: మేడమ్‌.. ప్రక్షాళన చేస్తారా?

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:24 AM

home minister tour in srikakulam శాంతిభద్రత పరిరక్షణ లో కీలకంగా వ్యవహరించే పోలీసుశాఖలో పలు సమస్యలు ఉన్నాయి. కొంతమంది సిబ్బంది తీరుతో ప్రజలకు సక్రమంగా సేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

Police department: మేడమ్‌.. ప్రక్షాళన చేస్తారా?

  • పోలీసుశాఖలో సరిదిద్దాల్సిన సమస్యలెన్నో

  • నేడు శ్రీకాకుళంలో హోంమంత్రి అనిత పర్యటన

  • శ్రీకాకుళం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): శాంతిభద్రత పరిరక్షణ లో కీలకంగా వ్యవహరించే పోలీసుశాఖలో పలు సమస్యలు ఉన్నాయి. కొంతమంది సిబ్బంది తీరుతో ప్రజలకు సక్రమంగా సేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీకాకుళం నగరానికి రాను న్నారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసుల ద్వారా ప్రజలకు అందే సేవల్లో పారదర్శకత.. అటు పోలీసుశాఖలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారంపై హోంమంత్రి దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

  • ఏళ్ల తరబడి ఐటీ వింగ్‌లో పాత సిబ్బందే..

  • జిల్లా పోలీసుశాఖలోని ఐటీ వింగ్‌ విభాగంలో చాలామంది పాత సిబ్బందే ఉన్నారు. కొందరు బదిలీల్లో స్టేషన్లను మార్చుకుని.. డిప్యూటేషన్‌ చూపిస్తూ ఏళ్లతరబడి అదే సీట్లలో అతుక్కుపోయారనే విమర్శలు ఉన్నా యి. పాతవారిని తప్పించి, కొత్తవారికి ఐటీ రంగంపై శిక్షణ ఇస్తే మరికొం త పారదర్శకంగా సేవలు లభించే అవకాశముంది.

  • కనిపించని ఫ్రెండ్లీ పోలీసింగ్‌..

  • జిల్లాలో ఎక్కడా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కనిపించడంలేదు. ఫిర్యాదుదారులతో మర్యా దపూర్వకంగా నడుచుకోకుండా కొంతమంది సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో చాలామంది పోలీసుస్టేషన్‌ కంటే.. జిల్లా పోలీసు కార్యాయానికే వచ్చి న్యాయం కోసం అర్జీలు ఇస్తున్నారు. అలాగే పరిధితో సంబంధం లేకుండా బాధితులు తక్షణ సహాయం కోసం సమీప పోలీసుస్టేషన్‌కు వెళ్తే ‘జీరో’ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఈ విషయాన్ని పోలీసుస్టేషన్లలో పట్టించుకోవడంలేదు. ఇది ఫలానా పరిధిలో ఉంది... ఫలానా స్టేషన్‌కు వెళ్లాలి అంటూ బాధితున్ని పంపేస్తున్నారు. అలాగే పాస్‌పోర్టు దరఖాస్తు దారుల పరిశీలనకు.. ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించి.. క్యారెక్టర్‌ సర్టిఫికెట్‌ విషయాల్లో సంబంధిత సిబ్బంది రూ.వేలల్లో మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక సివిల్‌ వ్యవహారాల్లో కొంతమంది పోలీసులు శ్రద్ధ చూపుతున్నారు.

  • ప్రారంభించని ‘మోడల్‌ పోలీసు స్టేషన్‌’...

  • మందస మండలంలో కోట్లాది రూపాయలతో మోడల్‌ పోలీసు స్టేషన్‌ను మూడేళ్ల క్రితం నిర్మించారు. కానీ ఇంతవరకు ప్రారంభించలేదు. ఎల్‌.ఎన్‌.పేట మండలంలో ఇంతవరకు పోలీసు స్టేషన్‌ నిర్మించలేదు. పక్క మండల సరిహద్దు పోలీసుస్టేషన్‌ సిబ్బందే ఆ మండలంలో లా అండ్‌ ఆర్డర్‌ను చూస్తున్నారు. ఇప్పటికైనా ఎల్‌.ఎన్‌.పేటలో పోలీసుస్టేషన్‌ను నిర్మించాలి.

  • పోలీసుల సమస్యలివీ

  • గత ప్రభుత్వ హయాంలో పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అని ఏడాదిన్నర పాటు అమలుచేసి చేతులెత్తేసింది. వీక్లీఆఫ్‌ను అమలు చేస్తే ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని పలువురు పోలీసులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌ ఉంచేసిన సరెండర్‌ లీవ్స్‌, అడిషనల్‌ సరెండర్‌ లీవ్‌లు.. వీటికి రావాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతున్నారు. ఇటీవల పోలీసులకు జరిగిన వైద్యపరీక్షల్లో ఐదు నుంచి పదిశాతం మందికి గుండె జబ్బులు వచ్చే అవకాశమున్నట్లు తేలింది. అలాగే 35 శాతం మందికి రక్తపోటు, చక్కెర ఉన్నట్లు గుర్తించారు. ఇటువంటి వారికి బందోబస్తు విధులలో.. కేవలం అంతర్గత జిల్లాలోనే కేటాయిస్తే వెసులుబాటు ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటిపై హోంమంత్రి.. ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:24 AM