encroachment: వామ్మో.. అన‘కొండలు’!
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:48 PM
Government land encroachment పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో అనకొండలు పెద్ద ఎత్తున ఆక్రమణలకు పాల్పడ్డారు. ప్రధానంగా సూదికొండ, నెమలికొండ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను సొంత స్థలాలుగా చూపించి రూ.కోట్లకు పడగలెత్తారు.

సూదికొండ, నెమలికొండ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు కబ్జా
ఆక్రమణల అమ్మకం సొమ్ము రూ.40కోట్ల పైమాటే...
నాలుగు ఎకరాల్లో కొత్తగా ఆక్రమణల గుర్తింపు
ఆ స్థలాల్లో పొరుగు జిరాయతీ నెంబర్లు వేసి విక్రయాలు
ఈసీ ఆధారంగా వారి పేర్లు గుర్తింపు
రెవెన్యూ అధికారుల సర్వేలో విస్తుపోయే నిజాలు
వారందరికీ నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు
పలాస, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి):
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ఒకటో వార్డుకు చెందిన వైసీపీ కార్యకర్త గతంలో గ్రామాల్లో జీడిపిక్కలు కిలోల వంతున కొనుగోలు చేసి గోనెసంచులతో తిరిగేవాడు. ప్రస్తుతం సర్వేనెంబరు 51లో సూదికొండ, నెమలికొండ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను సొంత స్థలాలుగా చూపించి రూ.కోట్లకు పడగెత్తాడు. ఖరీదైన కార్లులో షికార్లు చేస్తున్నాడు.
మరో వ్యక్తి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఓ ప్రజానాయకుడి వద్ద అసిస్టెంట్‌గా గతంలో పనిచేసేవాడు. పొరుగు గ్రామం నుంచి వచ్చి ఇక్కడ ప్రస్తుతం నెంబర్‌వన్ నాయకుడిగా ఎదిగాడు. ఇంటిలో ట్యూషన్లు చెప్పుకొని బతుకుదెరువు చూసుకునే ఈ ఆసామి ప్రస్తుతం రూ.కోట్లకు పడగెత్తాడు. రెండు కొండల్లో ప్రభుత్వ భూములు కబ్జా చేసి పక్క నెంబర్లతో రిజిస్ట్రేషన్లు చేసిన ఘన చరిత్ర ఉంది. అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తే తాను ఇక్కడ అధ్యక్షుడినని, తన భూమినే లాక్కుంటారా? అంటూ చిందులు వేస్తాడు.
మరో యువ నాయకుడు తన తల్లిపేరుతో ఎకరాల కొద్దీ భూమి ఉందని, దీన్ని కేంద్రీయ విద్యాలయం పేరుతో సేకరించడం తగదని.. ఆయన ఆధ్యర్యంలో స్థలాలను కొనుగోలు చేసే పేదలను రెచ్చగొడుతూ మొత్తం భూ కబ్జాలన్నీ అధికారపార్టీ నాయకులే చేస్తున్నారని ప్రచారాలు సాగిస్తున్నాడు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ నాయకులను మచ్చిక చేసుకొని పబ్బం గడుపుతున్న ఘన చరిత్ర ఈయనకు ఉంది.
వీరితోపాటు మరో ఇద్దరు చోటా నాయకులు కూడా తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా నెమలి, సూదికొండ ప్రభుత్వ భూముల అమ్మకంలో చరిత్ర సృష్టించారు. తామేమీ తక్కువ తినలేదని అధికారపార్టీ కార్యకర్త ఒకరు నాయకుల పేరు చెప్పి చిన్నచిన్న ప్లాట్లు రూపేనా విక్రయించాడు. దీంతో ప్రస్తుతం పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇటీవల మాజీమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సూదికొండలో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, పేదలు కట్టుకునే స్థలాలు తొలగించి.. పెద్దల స్థలాలు విడిచిపెట్టారని, అవికూడా టీడీపీ నాయకులకు చెందినవేనని తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించగా సూదికొండ ప్రాంతంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆక్రమణల వ్యవహారం బయటపడింది.
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో అనకొండలు పెద్ద ఎత్తున ఆక్రమణలకు పాల్పడ్డారు. ప్రధానంగా సూదికొండ, నెమలికొండ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను సొంత స్థలాలుగా చూపించి రూ.కోట్లకు పడగలెత్తారు. ఇందులో వైసీపీతోపాటు టీడీపీలోని కొంతమంది కీలకపాత్ర పోషించడం చర్చనీయాంశమవుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దువ్వాడ శ్రీకాంత్‌కు సూదికొండపై కంకర తవ్వకాలకు అన్నీ అనుమతులు లభించాయి. దీంతో ఆయన కంకర తవ్వకాలు సాగించారు. అనంతరం శ్రీకాంత్- మాజీమంత్రి సీదిరి అప్పలరాజు మధ్య వైరం రావడంతో కొండపై తవ్వకాలు ఆగిపోయాయి. దీనివెనుక మాజీమంత్రి ప్రోత్సాహం ఉందని శ్రీకాంత్ భావించి.. వైసీపీ నుంచి కూడా ఆయన తప్పుకుని టీడీపీలో చేరారు. ఈ క్రమంలో కంకర తవ్వకాలు ఒకపక్క సాగుతుండగా వైసీపీ నాయకుల దందా అక్కడ ప్రారంభమైంది. చదును చేసే స్థలాలకు పట్టాలు సృష్టించి మొక్కలు నాటడం, పునాదులు వేయడం చేశారు. తప్పని తెలిసినా నాయకుల అండదండలతో మొత్తం సగం కొండ దిగువభాగంపై పట్టాలు సృష్టించుకున్నారు. తాము ఆక్రమించిన స్థలాన్ని మూర రూ.70వేలు లెక్కన ఒక్కో బిట్ విస్తీర్ణం బట్టి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు చొప్పున విక్రయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రీయ విద్యాలయానికి అనుమతులు లభించడంతో సర్వేనెంబరు 51లో కొండ దిగువభాగంలో ఉన్న మొత్తం ఆక్రమణలు తొలగించి 10ఎకరాల స్థలాన్ని రిజర్వు చేశారు. కంకర తవ్వకాలకు అనుమతులు ఉన్న దువ్వాడ శ్రీకాంత్ సైతం తన ప్రతిపాదన విరమించుకుని కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సహకారం అందించారు. దీంతో ఇటీవల ఆ స్థలాన్ని చదును చేశారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో ఓ టీడీపీ కార్యకర్త కూటమి ప్రభుత్వం రాకముందు నుంచి స్థలాలు ఆక్రమించి ప్లాట్లుగా అనేక మందికి విక్రయించాడు. ఇళ్లు, పునాదులు నిర్మిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆశ కల్పించాడు. అలాగే కొంతమంది దీంతో రూ.లక్షలు పెట్టుబడి పెట్టి కొంతమంది గృహాలు, పునాదులు నిర్మించుకున్నారు. ఇటీవల మొత్తం వాటిని అధికారులు తొలగించడంతో అక్రమాల వ్యవహారం బయటపడింది. వైసీపీ, టీడీపీ నాయకులు మొత్తం కొండను ఆక్రమించి 300 ప్లాట్లకుపైగా స్థలాలను సుమారు రూ.40కోట్లకుపైగా విక్రయించినట్టు అంచనా. ఈ వ్యవహారం అంతా పొక్కడంతో కొనుగోలుదారులు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వద్ద మొర పెట్టుకున్నారు. ఆమె సూచనల మేరకు వారంతా పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ప్లాట్లు విక్రయించిన వైసీపీ, టీడీపీ నేతల గుండెల్లో అలజడి రేగుతోంది.
వేరే సర్వే నెంబర్లతో విక్రయాలు
మాజీమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తన బృందంతో సూదికొండను ఇటీవల పరిశీలించారు. ఆక్రమణ చెరలో ఉన్న భూములకు విముక్తి కల్పించాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు సూక్ష్మ పరిశీలన చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. సర్వేనెంబరు 51లో ఉన్న సూదికొండ ప్రభుత్వ స్థలాల్లో నాలుగు ఎకరాలకు పైగా స్థలాలు వేరే సర్వేనెంబర్లు వేసి విక్రయించినట్టు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి కాశీబుగ్గ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల అధికారులు ఆరా తీయగా ముందుగా అటువంటి సర్వేనెంబరులో రిజిస్ట్రేషన్లు జరగలేదని వచ్చింది. తరువాత సూక్ష్మపరిశీలనలో అదే నెంబరులో వేరే సర్వేనెంబరు వేసి పక్కా రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఈసీ రికార్డు పరిశీలించగా అధికారులు ఆశ్చర్యపడాల్సి వచ్చింది. మొత్తం ఆ సర్వేనెంబరులో ఎంత మంది రిజిస్ట్రేషన్లు చేశారో.. వారి వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ఇద్దరు సర్వేయర్లు, ముగ్గురు వీఆర్వోలతో కూడిన బృందం ఆ సర్వేలో వాస్తవాలు పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఇదే అక్రమమని తేలితే ఈ స్థలాలు అమ్మకాలు చేసింది ఎవరనేది బట్టబయలు అవుతుందనడంలో సందేహమే లేదు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి వద్ద ప్రస్తావించగా.. ‘నాలుగున్నర ఎకరాల స్థలం తప్పుడు సర్వేనెంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించాం. దీనిపై రికార్డులు పరిశీలిస్తున్నాం. గతంలో సర్వేనెంబరు 51లో పట్టాలు ఇచ్చింది, లేనిది పరిశీలిస్తున్నాం. పట్టాలు లేనివారిపై చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమ’ని తెలిపారు.