Development : ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:30 AM
Distribution of ‘Annadatha Sukhibhav’ cheques రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం లావేరు మండలం బొడ్డపాడులో పౌరసరఫరాలశాఖ గోదాము వద్ద ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్’ తొలివిడత పథకాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు రైతులకు చెక్కులను అందజేశారు. అలాగే డ్రోన్ పరికరాన్ని ప్రారంభించారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండలపల్లి శ్రీనివాస్
బొడ్డపాడులో ‘అన్నదాత సుఖీభవ’ చెక్కుల పంపిణీ
లావేరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం లావేరు మండలం బొడ్డపాడులో పౌరసరఫరాలశాఖ గోదాము వద్ద ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్’ తొలివిడత పథకాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు రైతులకు చెక్కులను అందజేశారు. అలాగే డ్రోన్ పరికరాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘గత వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించింది. రాష్ట్రాన్ని అప్పులమయం చేసింది. ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా భావిస్తూ.. కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి ప్రతీ రైతుకు రూ.20వేలు చొప్పున విడతల వారీ అందజేయనుంది. ఈ పథకం ద్వారా జిల్లాలో 2.70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఈ-పంట నమోదు చేసిన తర్వాత కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపజేస్తాం. డ్వాక్రా సంఘాల మహిళలకు అవసరం మేరకు రూ.90వేల కోట్లు రుణాలు అందజేయనున్నామ’ని తెలిపారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. ‘జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకి అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద రూ 160 చెల్లిస్తే.. పంట నష్టపోయిన రైతుకు పరిహారం అందుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసు కోవాలని కోరారు.
స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ.. ‘ ఎచ్చెర్ల నియోజకవర్గం.. పూర్తిగా వ్యవసాయాధారితం. ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమలు స్థాపించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయు దృష్టికి తీసుకెళ్లాను. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం కింద నియోజకవర్గంలో 48,103 రైతులకు రూ.3,189.89 లక్షల వరకు లబ్ధి చేకూరింద’ని తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఆర్డీవో ప్రత్యూష, వ్యవసాయశాఖ జేడీ త్రినాథస్వామి, ఏడీఏ శ్రీనివాస్, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ముప్పిడి సుజాత, మండల టీడీపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్, బీజేపీ మండల అధ్యక్షుడు ఎల్.అప్పలనాయుడు, ఎంపీడీవో పి.వెంకటరాజు, తహసీల్దార్ జి.శ్రీనివాసరావు, ఏవో మహేష్ నాయుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ తోటయ్యదొర, కూటమి నాయకులు లంక నారాయణరావు, ముప్పిడి మురళీమోహన్, గొర్లె శ్రీనివాసరావు పాల్గొన్నారు.