Share News

safe kidney patients : ఉద్దానానికి ఊపిరి!

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:35 AM

kidney disease deaths ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తగ్గుముఖం పడుతుందా?.. మారిన ప్రజల జీవనశైలి, ఆహార అలవాట్లే ఇందుకు కారణమా?.. అందుకే మరణాల సంఖ్య తగ్గుతుందా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రం (200 పడకల ఆసుపత్రి) ప్రకటించిన గణాంకాలే నిదర్శనం.

safe kidney patients : ఉద్దానానికి ఊపిరి!
పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రి.. 1పీఎల్‌ఎస్‌పి9

  • తగ్గుతున్న కిడ్నీ బాధితుల మరణాలు

  • గడచిన ఆరు నెలల్లో ఆరుగురు మృతి

  • గతంలో పదుల సంఖ్యలో మృత్యువాత

  • చంద్రబాబు సీఎం అయ్యాక పటిష్ట చర్యలు

  • ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న అధికారులు

  • సురక్షిత తాగునీరు, ఆహారపు అలవాట్లు

  • ఉచితంగా డయాలసిస్‌, మందులు, పింఛన్లు

  • పరిశోధన కేంద్రం, ఆస్పత్రి గణాంకాలపై ఊరట

  • పలాస మండలం గొల్లమాకన్నపల్లి గ్రామానికి చెందిన రాపాక కోటేశ్వరరావు టైలరింగ్‌ చేసుకొని జీవిస్తున్నారు. 18 ఏళ్ల కిందట కోటేశ్వరరావుకు కిడ్నీ వ్యాధి సోకింది. ఎందుకు వచ్చిందో తెలుసుకునేలోపే శరీరంలో అవయవాలు పనిచేయడం మానేశాయి. వారానికి మూడు రోజులు డయాలసిస్‌ చేయించుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. తన గ్రామంలో ఇప్పటి వరకూ తన ఎదుటే 50కు పైగా కిడ్నీ వ్యాధితో మరణించారని ఆయన ఆవేదనతో తెలిపారు. సక్రమమైన ఆహార పద్ధతులు, నిత్యం మందులు వేసుకోవడం, డయాలసిస్‌ కారణంగా తాను ఇంకా భూమిపై ఉన్నానని చెబుతున్నారు.

  • ....................

  • పలాస మండలానికి చెందిన లండ వరలక్ష్మికి ఇటీవల ఉన్నట్లుండి బీపీ పెరిగింది. నడుస్తుంటే ఆయాసం వస్తుంది. ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా కిడ్నీ వ్యాధిగా తేలింది. ‘మా ఇంటిలో ఎవరికీ ఇటువంటి వ్యాధి లేదు. డయాలసిస్‌ చేయించుకుంటున్న నాకు ప్రభుత్వం ఉచితంగా మందులు, ఖర్చులకు రూ.10వేలు పింఛను అందిస్తుంది. వ్యాధి తగ్గుముఖం పట్టడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.’ వరలక్ష్మి కోరుతోంది.

  • ..................

  • పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రిలో..

  • డయాలసిస్‌ చేసుకున్న వారు: 2024లో 6,454 మంది

  • 2025 జనవరి నుంచి ఇప్పటివరకూ 3,929 మంది

  • కిడ్నీ బాధితుల మరణాలు: 2024లో 40 మంది

  • 2025 జనవరి నుంచి జూలై వరకూ.. ఆరుగురు మాత్రమే

  • .....................

  • పలాస, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తగ్గుముఖం పడుతుందా?.. మారిన ప్రజల జీవనశైలి, ఆహార అలవాట్లే ఇందుకు కారణమా?.. అందుకే మరణాల సంఖ్య తగ్గుతుందా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రం (200 పడకల ఆసుపత్రి) ప్రకటించిన గణాంకాలే నిదర్శనం. ఆసుపత్రి ప్రారంభించిన నుంచి ఇప్పటి వరకూ కిడ్నీ మరణాలను పరిశీలిస్తే.. గత ఏడాది 40 మరణాలు సంభవిస్తే తరువాత ఆరు నెలల కాలంలో కేవలం ఆరుగురు మాత్రమే మృతి చెందినట్లు రికార్డులు చెబుతున్నాయి. గ్రామాల్లో శుద్ధ జలాల పంపిణీ, కిడ్నీ బాధితులు తమ ఆహార అలవాట్లు మార్చుకోవడం, సకాలంలో స్పందించి డయాలసిస్‌ చేయించుకోవడం, తగిన మందులు వినియోగించడం, స్వీయనియంత్రణ ద్వారా కిడ్నీ మరణాలు తగ్గుముఖం పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

  • గొల్లమాకన్నపల్లిలోనే 50 మరణాలు..

  • పలాస మండలం గొల్లమాకన్నపల్లి గ్రామం నాలుగేళ్ల కిందట కిడ్నీ వ్యాధితో వణికిపోయింది. నాలుగేళ్లలో 50 మంది వరకూ మృతి చెందారు. ఎందుకు వ్యాధి వస్తుందో, ఎందుకు చనిపోతున్నారో తెలుసుకున్నంతలోపే పదుల సంఖ్యలో మరణాలు సంభవించేవి. గ్రామాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోదామా అనే పరిస్థితికి గ్రామస్థులు వచ్చేశారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, రాజకీయ నాయకుల వైపు సహాయం కోసం వేచి చూడాలి వచ్చేది. అయితే, ప్రస్తుతం గొల్లమాకన్నపల్లిలో వ్యాధి తీవ్రత తగ్గింది. ఆరుగురు వరకూ డయాలసిస్‌ రోగులు ఉన్నారు. కొత్తగా వ్యాధి సోకిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఉద్దానంలో అక్కడడక్కడా మరణాలు జరుగుతున్నా 15 ఏళ్ల కిందట ఉన్న పరిస్థితి ప్రస్తుతం లేదు. గతంలో కిడ్నీ వ్యాధిపడిన వారే ప్రస్తుతం డయాలసిస్‌ చేయించుకుంటున్నారు.

  • గత టీడీపీ ప్రభుత్వ చర్యలతో సత్ఫలితాలు..

  • ఉద్దానంలో కిడ్నీ వ్యాధి నియంత్రణకు గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రస్తుతం సత్ఫలితాలు ఇస్తున్నాయి. వ్యాధి మూలకారకాలను తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించడం, ఇంటింటా సర్వే నిర్వహించడం, వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి గత టీడీపీ ప్రభుత్వం చేసింది. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయాలని భావించిన ఎన్టీఆర్‌ సుజలధార పథకాన్ని ఉద్దానానికి తీసుకువచ్చారు. ఈ పథకంలో భాగంగా ఎక్కడికక్కడే మాస్టర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసి 20 లీటర్ల శుద్ధ జలాన్ని కేవలం రూ.2కే ప్రజలకు అందించారు. అదే విధంగా జలజీవన్‌మిషన్‌ ద్వారా ఇంటింటికీ శుద్ధ జలాలను సరఫరా చేశారు. డయాలసిస్‌ రోగులకు ఉచితంగా మందులతో పాటు రూ.6వేల పింఛన్‌ అందించింది. పింఛన్‌ డబ్బులతో డయాలసిస్‌ రోగులు బలవర్ధకమైన ఆహారం తీసుకునేవారు. ఇవాన్ని కూడా ప్రస్తుతం కిడ్నీ వ్యాధి, మరణాలు తగ్గడానికి కారణమయ్యాయి.

  • వ్యాధి మూలాలపై అన్వేషణ

  • ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి గల కారణాలపై నెఫ్రో వైధ్యాధికారి డాక్టర్‌ రవిరాజ్‌తో కూడిన బృందం గతంలో అన్వేషణ చేపట్టింది. పలాస, మందస, వజ్రపుకొత్తూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లో పర్యటించింది. వ్యాధి మూలకాలను గుర్తించినా అవి ప్రయోగాత్మకంగా నిరూపితం కావాల్సి ఉంది. అదే విధంగా ఆంధ్రాయూనివర్సిటీకి చెందిన అనేక మంది పరిశోధకులు కూడా ఉద్దానం కిడ్నీ వ్యాధులపై అధ్యయనం చేశారు. దశాబ్దాల కాలంలో ఈ ప్రాంతంలో విస్తారంగా పండే జీడి పంటలకు వేసే క్రిమిసంహారక మందులు భూమిలో కలసిపోయి వ్యాధి తీవ్రతకు ఒక కారణమని విశ్లేషించారు.

  • రాష్ట్ర ప్రభుత్వం పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రంలో ఉన్న గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌కు పరిశోధన బాధ్యతలు అప్పగించింది. విదేశాలకు చెందిన నెఫ్రాలజిస్టులు, శాస్త్రవేత్తల బృందం ఇప్పటికే అనేక దశల్లో పరిశోధన చేసింది. వీటి ఫలితాలు వెలువడేసరికి మరో ఏడాది సమయం పట్టవచ్చు. ప్రస్తుతం వ్యాధి మూలకారకాలతో సంబంధం లేకుండా అనేక గ్రామాల్లో వ్యాధి తగ్గుముఖం పడుతున్న వేళ ప్రజలు మరింత అప్రమత్తం కావాల్సి ఉందని నిపుణులైన వైద్యాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తాగునీరు, ఆహార అలవాట్లు మార్చుకోవడం, వేగంగా అరుగుదల ఉండే ఆహారం తీసుకోవడం, జంక్‌ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండడం, నిత్యం వ్యాయామం చేయడం, ఏ చిన్న అనారోగ్యం వచ్చినా నిపుణుల సూచనలు పాటిస్తూ తగిన మందులు వినియోగించడం చేస్తే వ్యాధిని అరికట్టడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని వైద్యాధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఒక ఇంటిలో కిడ్నీ వ్యాధి సోకితే భయపడకుండా మొత్తం ఆ ఇంటిళ్లపాది పరీక్షలు చేసుకోవడమే ఉత్తమమని అంటున్నారు. వ్యాధికి గల కారకాలు తెలిసి, అది అదుపులోకి వస్తే ఉద్దానం మరో ఉద్యానవనం కావడం ఖాయం.

  • ....................

  • నిర్లక్ష్యం వద్దు

  • గడచిన ఆరు నెలల్లో ఉద్దానంలో కిడ్నీ మరణాలు తగ్గాయి. మా ఆసుపత్రిలో గత ఏడాది 40 మంది వరకూ మరణించారు. గత ఆరు నెలల్లో కేవలం ఆరుగురు మాత్రమే మృత్యువాత పడ్డారు. డయాలసిస్‌ దశ వచ్చిన వరకూ ఆసుపత్రికి రాకపోవడం వల్లే కిడ్నీ మరణాలు జరుగుతున్నాయి. ప్రారంభ దశలోనే తగిన మందులు వేసుకొని, ఆహార అలవాట్లు మార్చుకుంటే కిడ్నీ వ్యాధి తీవ్రత ఉండదు. మూడు, నాలుగేళ్లలో వ్యాధి పూర్తిగా తగ్గించవచ్చు. ఒక ఇంటిలో ఎవరికైనా వ్యాధి సోకితే మిగతా వారు కూడా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మా ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిని నయం చేయడానికి తగిన పరికరాలు, మందులు ఉన్నాయి. మొత్తమంతా ఉచితంగానే అందిస్తాం.

    - డాక్టర్‌ అల్లు పద్మజ, సూపరింటెండెంట్‌, కిడ్నీ పరిశోధన కేంద్రం, పలాస.

  • .......................

  • వ్యాధి తీవ్రత తగ్గింది

  • కిడ్నీ వ్యాధిపై ఇప్పటికీ ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. మరణాలు తగ్గినా ప్రభుత్వం ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉండాలి. వ్యాధి మూలాలు కనుగొని వాటిపై దృష్టిపెట్టి నివారణ చర్యలు తీసుకుని ఉండుంటే ఇంతగా వ్యాధి ప్రబలేది కాదు. నాలుగేళ్ల కిందట ఉన్న తీవ్రత ప్రస్తుతం తగ్గింది. ప్రభుత్వం పూర్తిగా చొరవ తీసుకొని సురక్షితమైన తాగునీరు అందించడంతో పాటు బాధితులు డయాలసిస్‌కు వెళ్లడానికి తగిన వాహనాలు సమకూర్చాలి.

    - తెప్పల అజయ్‌కుమార్‌, జీడి రైతాంగ సాధనకమిటీ చైర్మన్‌, మాకన్నపల్లి.

  • ...................

  • స్వీయ నియంత్రణ అవసరం

  • స్వీయ నియంత్రణతోనే కిడ్నీ వ్యాధి అదుపులోకి వస్తుంది. పరిశుభ్రమైన నీరు తాగకపోవడం, మంచి ఆహార అలవాట్లు పాటించకపోవడం, విపరీతంగా ఔషధాల వినియోగం వంటి కారణాలతో ఉద్దానానికి గతంలో కిడ్నీ భూతం పట్టింది. ప్రస్తుతం ప్రజల్లో మార్పు వచ్చింది. సురక్షితమైన నీరు తీసుకుంటున్నారు. ఆహార అలవాట్లలో కూడా మార్పు వచ్చింది. ప్రభుత్వం సర్వేచేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు, అవసరం ఉన్నవారికి డయాలసిస్‌ చేయించాలి. వారికి ఆసుపత్రికి వెళ్లడానికి వీలుగా వాహన సౌకర్యం కల్పించాలి. ముఖ్యంగా ప్రజలకు వ్యాధి కారకాలపై అవగాహన కల్పించాలి. పరిశోధన ఫలితాలు వచ్చిన వెంటనే ప్రజలకు తెలియజేయాలి.

    -కోరాడ లింగమూర్తి, రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌, గొల్లమాకన్నపల్లి.

Updated Date - Aug 03 , 2025 | 12:35 AM