Share News

Happy fathers day: నాన్న.. నీ మనసు వెన్న

ABN , Publish Date - Jun 15 , 2025 | 12:24 AM

Father's Day emotional tribute నాన్న... రెండు అక్షరాలే.. కానీ కుటుంబానికి వెన్నెముక. తాను జీవితంలో అనుభవించిన కష్టాలు.. చవిచూసిన బాధలూ.. తన పిల్లలు పడకూడదనే నిరంతరం పనిచేసే శ్రమజీవి.

Happy fathers day: నాన్న.. నీ మనసు వెన్న
నాన్న దినకర్‌ పుండ్కర్‌తో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • తండ్రి ప్రోత్సాహంతోనే ఉన్నత రంగం

  • నేడు ‘ఫాదర్స్‌ డే’...

  • శ్రీకాకుళం, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): నాన్న... రెండు అక్షరాలే.. కానీ కుటుంబానికి వెన్నెముక. తాను జీవితంలో అనుభవించిన కష్టాలు.. చవిచూసిన బాధలూ.. తన పిల్లలు పడకూడదనే నిరంతరం పనిచేసే శ్రమజీవి. ఆదివారం ఫాదర్స్‌ డే సందర్భంగా జిల్లాలో పలువురి ప్రముఖులను ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించింది. వారి ఉన్నతాభివృద్ధి వెనుక తండ్రి ప్రోత్సాహం మరువలేనిదంటూ.. పేర్కొన్నారు. తండ్రి త్యాగం, ప్రేమ, బాధ్యతలను గుర్తుచేసుకుంటూ అంతరంగాన్ని పంచుకున్నారు.

  • నాన్న ప్రేరణతోనే ఐఏఎస్‌ అయ్యా..

  • మాది మహారాష్ట్ర. మానాన్న పేరు దినకర్‌ పుండ్కర్‌. ప్రభుత్వ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. ఆయన ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ప్రజలకు సేవ చేసేవారు. కొడుకు కలెక్టర్‌ కావాలని.. అందుకు అవసరమైన ప్రిపరేషన్‌.. సూచనలు ఇచ్చేవారు. నాకు మా నాన్న ఇచ్చిన తర్ఫీదు.. సూచనలు చాలా బాగా పనికివచ్చాయి. నాన్న ప్రోత్సాహం వల్లనే కలెక్టర్‌ అయ్యాను. ప్రజలకు సేవ చేస్తున్నా. ఇప్పటికీ నా పేరులో మా నాన్న పేరును కూడా జోడించి ‘స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌’గా మార్చుకున్నాను. మా నాన్న ఇప్పుడు శ్రీకాకుళంలోనే నాతోనే ఉంటున్నారు. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.

    - కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌,

    .......................

  • శ్రమించి చదివించారు :

  • మా సొంత ప్రాంతం రాయచోటి. నాన్న పేరు వెంకట్రామిరెడ్డి. మాది చిన్న వ్యవసాయ కుటుంబం. అయినప్పటికీ శ్రమించి మమ్మల్ని చదివించారు. పిల్లలు ఉన్నత రంగంలో స్థిరపడ్డారంటే కచ్చితంగా ప్రతి కుటుంబంలో తండ్రి పాత్ర కీలకం. మా నాన్న మా చదువుకోసం ఎంతగానో శ్రమించారు.. ప్రోత్సహించారు. అందుకే ఈరోజు అదేరీతిన తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చేలా కష్టపడి.. ఇప్పుడు ఈ స్థానంలో కొనసాగుతున్నాం. మా నాన్న శ్రీకాకుళంలో మాతోనే ఉన్నారు.

    - ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

    .....................

  • తప్పు చేయొద్దని చెప్పారు

  • మా తాత సర్దార్‌ గౌతు లచ్చన్న. తాత గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మా నాన్న గౌతు శ్యామసుందర శివాజీ. తాత నుంచి మానాన్న నిజాయితీ.. ముక్కుసూటి తనం నేర్చుకుని అదే జీవితంలో అమలు చేశారు. మూడున్నర దశాబ్దాలు ఎమ్మెల్యేగా ప్రజలకు మా నాన్న శివాజీ సేవలు అందించారు. మా నాన్నకు మగ పిల్లలు లేరు. మేమే. అయినప్పటికీ.. ఏవిషయంలోనూ వెనకడుగు వేయలేదు. మా చదువు నుంచి పెళ్లి వరకు మా ఇష్టాన్ని గౌరవించారు. ‘జీవితంలో ఏనాడూ తప్పు చేయవద్దు.. తప్పు చేస్తే కార్యకర్త వద్దనైనా సరే తలవంచాల్సిందే’ అని చెప్పారు. నీతినిజాయితీ పరమావధి అన్నది నాన్న నమ్మిన సిద్ధాంతం. ఈ రోజు గౌరవం.. గుర్తింపు.. మా నాన్న వల్లనే. నాన్న, తాత పేరు నిలబెట్టడమే నా ధ్యేయం.

    - గౌతు శిరీష, ఎమ్మెల్యే, పలాస

    ...................

  • నాన్న పేరుతోనే ట్రస్టు నెలకొల్పా

  • మా నాన్న మామిడి అప్పారావు. పాతపట్నం మండలం తామర గ్రామం. ఎన్నో కష్టాలను చవిచూశారు. తాను కూలి పనిచేసి.. నన్ను ఎంఎస్సీ చదివించారు. అప్పట్లో రోజు కూలి రూ.7. ఆ డబ్బులను ఖర్చుచేయకుండా నాకు కళాశాల వెళ్లివచ్చేందుకు చార్జీలకు ఇచ్చేవారు. నాన్న అనారోగ్యంతో మరణించారు. నాన్న పేరుతో రూ.10 కోట్లతో ‘మామిడి అప్పారావు’ ట్రస్టు నిర్వహించి.. సేవా కార్యక్రమాలు చేపట్టాను.

    - మామిడి గోవిందరావు, ఎమ్మెల్యే, పాతపట్నం

Updated Date - Jun 15 , 2025 | 12:24 AM