pensions: పింఛన్ల విధానంలో ఆదర్శం
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:46 AM
Welfare is the goal of the government పింఛన్ల విధానంలో మన రాష్ట్రం.. దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రతీ కుటుంబం సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం మండలం పాత్రునివలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్
శ్రీకాకుళం రూరల్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పింఛన్ల విధానంలో మన రాష్ట్రం.. దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రతీ కుటుంబం సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం మండలం పాత్రునివలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. నూతన వితంతు పింఛన్లను కూడా లబ్ధిదారులకు అందజేశారు. మాజీ సర్పంచ్ అప్పలనాయుడు, గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ ఆదేశించారు. ‘ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ప్రతీనెలా 1న పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నాం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చాం. నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి.. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యం. స్వచ్ఛాంద్ర, స్వర్ణాంధ్రలో ప్రజలు భాగస్వామ్యం కావాలి’ అని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. అలాగే పింఛన్ పొందిన భర్త మరణిస్తే.. ఆ తర్వాత నెల నుంచే భార్య వితంతు పింఛన్ మంజూరు చేస్తామన్నారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. ‘గ్రామస్థుల అభ్యర్థన మేరకు చెరువులో గుర్రపు డెక్కను తొలగిస్తాం. మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. గ్రామ పర్యావరణ పరిశుభ్రతకు ప్రజలు సహకారం అవసరమ’ని తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. గ్రామాన్ని కార్పొరేషన్‌లో విలీనం చేయడంతో ఉపాధిహామీ పనులు తాత్కాలికంగా నిలిచినా, రూ. 40లక్షల చొప్పున రెండు రోడ్లకు నిధులు మంజూరు చేశామన్నారు. కాలువ పనులు త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయిప్రత్యూష, కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.