Son Assassinated Parents:కొడుకు కాదు రాక్షసుడు
ABN , Publish Date - Apr 27 , 2025 | 02:52 AM
ఆస్తి విషయంలో తల్లిదండ్రులతో గొడవపడిన కుమారుడు రాజశేఖర్ ట్రాక్టర్‌తో వారిని ఢీకొట్టి హత్య చేశాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

పూసపాటిరేగ, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): రక్తం పంచుకు పుట్టిన చెల్లెలికి ఆస్తి పంచితే తట్టుకోలేకపోయాడు! కళ్లలో పెట్టుకుని కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులతో కొన్నాళ్లుగా ఆస్తి విషయమై గొడవపడుతున్నాడు. సోదరి వాటా పొలాన్ని ధ్వంసం చేసేందుకు సిద్ధమైన తనను అడ్డుకున్నందుకు కని పెంచిన అమ్మానాన్ననే అంతమొందించాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీకి చెందిన పాడ్రంకి అప్పలనాయుడు (55), జయ (45) భార్యాభర్తలు. వీరికి కుమారుడు రాజశేఖర్, కుమార్తె రాధాకుమారి ఉన్నారు. ఇద్దరికీ వివాహమైంది. రాధాకుమారికి వివాహమైన కొద్ది రోజులకే భర్త మృతి చెందాడు. ఆమెకు ఆర్థిక ఆసరా అవసరమని భావించిన తల్లిదండ్రులు తమ 80 సెంట్ల భూమిలో 20 సెంట్లను గతంలో రాసి ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మరో 30 సెంట్లను కూడా ఆమెకు రాసినట్టు తెలుసుకున్న రాజశేఖర్ నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు.
శనివారం ఎక్స్‌కవేటర్‌తో పొలాన్ని తవ్వుతుండగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన రాజశేఖర్ ట్రాక్టర్‌తో తల్లిదండ్రులను ఢీకొట్టేందుకు యత్నించగా, పక్కనున్న మొక్కజొన్న తోటలోకి పరిగెత్తి దాక్కొనేందుకు ప్రయత్నించారు. అయినా రాజశేఖర్ ఆగకుండా వారిపైకి ట్రాక్టర్‌తో దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన అప్పలనాయుడు, జయ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.