Sharmila: హంతకుల శ్రీరంగ నీతులకు మోదీ నిలువుటద్దం
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:06 AM
హంతకులు శ్రీరంగ నీతులు చెబితే ఎలా ఉంటుందో ఇవ్వాళ మోదీని చూస్తే అర్థమవుతుంది.అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

కూటమి ప్రభుత్వానికి పైత్యం పరాకాష్ఠకు చేరింది: షర్మిల
అమరావతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ‘హంతకులు శ్రీరంగ నీతులు చెబితే ఎలా ఉంటుందో ఇవ్వాళ మోదీని చూస్తే అర్థమవుతుంది’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. యోగా డేపై ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘విశాఖ ఉక్కు ప్రాణం తీస్తూ, కార్మికుల పొట్ట కొడుతూ, మానసిక క్షోభకు గురిచేస్తూ, ఆరోగ్యం కోసం యోగా చేయమని అదే విశాఖలో మోదీ చెప్పడం విడ్డూరం. ప్రభుత్వానికి పైత్యం పరాకాష్ఠకు చేరింది. యోగాంధ్ర గిన్నిస్ రికార్డుల కోసం పసి బిడ్డలను అవస్థలు పెడతారా? తిండి తిప్పలు లేకుండా కడుపులు మాడ్చుతారా? వేల మంది బిడ్డలను రూముల్లో వేసి కుక్కుతారా? వాళ్లను పిల్లలు అనుకుంటున్నారా... గొర్రెలనుకుంటున్నారా? ఆ బిడ్డలు గిరిజన బిడ్డలనే కదా ఈ ప్రభుత్వానికి చిన్నచూపు. ఏం చేసినా నోరు మెదపరనే కదా నిర్లక్ష్యం? మోదీ మెప్పు కోసం ఇంత దిగజారుడు తనమా? మోదీ యోగా కోసం బడ్డల ప్రాణాలను పణం పెడతారా? మోదీ షేమ్ షేమ్. కూటమి ప్రభుత్వానికి ఇది నిజంగా సిగ్గుచేటు.
గిన్నిస్ రికార్డు యోగాంధ్రకు కాదు... 27 వేల మంది గిరిజన విద్యార్థులకు ఆకలి కేకలు పెట్టించినందుకు ఇవ్వాలి. రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో రూ.300 కోట్లు ఖర్చు పెట్టి యోగాంధ్ర చేయమని ఎవరు అడిగారు? చేసిన మోసాలు చాలవన్నట్లు ఏ మొహం పెట్టుకొని మోదీ రాష్ట్రానికి వచ్చారు? తిరుపతిలో ఇచ్చిన విభజన హామీలు ఏమయ్యాయి? సైలెంటుగా హోదాను అటకెక్కించారు. సక్రమ, అక్రమ పొత్తులు, దత్త పుత్రుల అండదండలు ఉన్నంతకాలం రాష్ట్రంలో మోదీ ఆడింది ఆట... పాడింది పాట’ అని షర్మిల విమర్శించారు.