Marriage Fraud: రెండేళ్లలో డజను పెళ్లిళ్లు
ABN , Publish Date - Jun 24 , 2025 | 03:15 AM
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వారే ఆమె లక్ష్యం. ఇలా రెండేళ్లలో ఏకంగా డజను పెళ్లిళ్లు చేసుకుంది.

డబ్బున్న పురుషులే టార్గెట్
విడాకుల కోసం కేసులు వేసిన వారిని గుర్తించి వల
కోనసీమలో నిత్య పెళ్లికూతురి మోసాలు
అండగా మరో ముగ్గురు.. అంతా కలిసి కోట్లు దండుకుంటున్నారు.. చర్యలు తీసుకోండి
అమలాపురం ఎస్పీకి బాధితుల ఫిర్యాదు
అమలాపురం, జూన్ 23(ఆంధ్రజ్యోతి):భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వారే ఆమె లక్ష్యం. ఇలా రెండేళ్లలో ఏకంగా డజను పెళ్లిళ్లు చేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ నిత్య పెళ్లికూతురి బాగోతంపై పలువురు బాధితులు అమలాపురంలోని జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు.
కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్న బేతి వీర దుర్గనీలిమ అనే యువతి, మరో ముగ్గురు సభ్యులతో కలిసి ముఠాగా ఏర్పడింది. రెండేళ్లలో 12మందిని పెళ్లి చేసుకుంది. వీరి టార్గెట్ ఒక్కటే.. డబ్బు! ముందుగా... భార్యతో విభేదాలు వచ్చి కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నవారు, పెళ్లికాని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ధనవంతులను టార్గెట్ చేసుకున్నారు. భార్యకు దూరంగా ఉండే భర్తలతో నీలిమ పరిచయం చేసుకుని సన్నిహితంగా ఉండేది. తనను పెళ్లి చేసుకునే వరకు కథ నడిపేది. నీలిమ కుటుంబ సభ్యులుగా.. దుర్గ అనే మహిళ, వీరలక్ష్మి, కళ్యాణ్ అనే వ్యక్తులు సహకరించేవారు. పెళ్లి చేసుకున్న తర్వాత నీలిమ అత్తవారి ఇంటికి వెళ్లేది కాదు. భర్త ఎదురుతిరిగితే కేసులు పెడతామని బెదిరించేది. రహస్య పెళ్లి, కాపురానికి సంబంధించిన ఫొటోలు దగ్గర పెట్టుకుని, వాటినే చూపిస్తూ ఎందరినో బ్లాక్‌మెయిల్ చేసి రూ.లక్షల్లో దోచుకునేవారు. ఇలా రెండేళ్ల కాలంలో 12మందిని పెళ్లి చేసుకుని వారి కుటుంబాల నుంచి రూ.కోట్లలో ఆస్తులు, డబ్బులు కాజేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.