Minister Savitha: రాజీనామా చేసే దమ్ముందా
ABN , Publish Date - Jun 17 , 2025 | 05:16 AM
తల్లికి వందనం పథకంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా. లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే దమ్ము మాజీ సీఎం జగన్‌కు ఉందా? అని మంత్రి సవిత సవాలు విసిరారు.

జగన్‌కు మంత్రి సవిత చాలెంజ్
పెనుకొండ టౌన్, జూన్ 16(ఆంధ్రజ్యోతి): ‘తల్లికి వందనం పథకంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా. లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే దమ్ము మాజీ సీఎం జగన్‌కు ఉందా?’ అని మంత్రి సవిత సవాలు విసిరారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని కియ వద్ద జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ‘ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేయించారు. అదే కియా సమీపంలో జగన్ సమావేశం పెట్టి, పరిశ్రమలను ఇక్కడి నుంచి తరిమికొడతానని బెదిరించారు. కియా ద్వారా ఈ ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయని, దీనికి చంద్రబాబే కారణం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంటే జగన్ జీర్ణించుకోలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలనూ నెరవేరుస్తున్నాం’ అని మంత్రి సవిత వివరించారు.