Governor Abdul Nazeer: వచ్చే ఏడాదికి రాష్ట్రంలో పూర్తిస్థాయి క్వాంటమ్ వ్యాలీ
ABN , Publish Date - Jul 05 , 2025 | 04:41 AM
నేషనల్ క్వాంటమ్ మిషన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ 2026 నాటికి పూర్తిస్థాయి క్వాంటమ్ వ్యాలీని స్థాపించనుందని రాష్ట్ర గవర్నర్, కాకినాడ జేఎన్టీయూకే కులపతి అబ్దుల్ నజీర్ అన్నారు.

జేఎన్టీయూకే స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
కాకినాడ, జూలై 4(ఆంధ్రజ్యోతి): నేషనల్ క్వాంటమ్ మిషన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ 2026 నాటికి పూర్తిస్థాయి క్వాంటమ్ వ్యాలీని స్థాపించనుందని రాష్ట్ర గవర్నర్, కాకినాడ జేఎన్టీయూకే కులపతి అబ్దుల్ నజీర్ అన్నారు. దీని ద్వారా పూర్తి పునరుత్పాదక శక్తితో నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి నగరంగా అమరావతి అవతరించనుందని ఆయన పేర్కొన్నారు. అబ్దుల్ నజీర్ అధ్యక్షతన కాకినాడలో జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకలకు అమెరికాలోని బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రహ్మణ్యం (సుబ్బు కోట) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గౌరవ డాక్టరేట్ (హానరి్‌స)ను ప్రదానం చేశారు. వేదికపై మొత్తం 99మంది రిసెర్చ్ స్కాలర్స్‌కు పీహెచ్‌డీ అవార్డులు, 35 మందికి బంగారు పతకాలు, ఐదుగురికి ఎండోమెంట్ అవార్డులను గవర్నర్, వీసీ ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవంలో ఉపకులపతి ప్రొఫెసర్ సీఎ్‌సఆర్‌కే ప్రసాద్, రెక్టార్ ప్రొఫెసర్ కేవీ రమణ, ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రవీంద్రనాథ్, ఓఎస్ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, డైరెక్టర్లు, జేఎన్టీయూకే కళాశాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐవోటీ, ఇ-మొబిలిటీ, పునర్వినియోగ ఇంధనం,రోబోటిక్స్, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. క్వాంటమ్‌మిషన్‌వల్ల 2026కల్లా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. విద్యార్థుల్లో కష్టపడేతత్వం ఉంటే విజయం దానంతట అదే వస్తుందన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.