Minister Gottipati Ravi: వర్షాలు వచ్చేలోగా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వండి
ABN , Publish Date - May 16 , 2025 | 04:40 AM
మంత్రి గొట్టిపాటి రవికుమార్ డిస్కమ్‌లకు వర్షాలు ప్రారంభమయ్యేలోపు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఎక్కువగా ఇవ్వాలని ఆదేశించారు. గిరిజన గ్రామాల్లో సోలార్ ప్యానెల్‌లతో పాటు బ్యాటరీ స్టోరేజ్‌తో బల్బులు, ఫ్యాన్లను అందించాలని సూచించారు.

డిస్కమ్‌ల సీఎండీలకు మంత్రి గొట్టిపాటి ఆదేశం
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): వర్షాలు వచ్చేలోగా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు సాధ్యమైనన్ని ఎక్కువగా ఇవ్వాలని విద్యుత్తు పంపిణీ సంస్థలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. గిరిజనులకు సూర్యఘర్ కింద సోలార్ ప్యానల్‌తోపాటు బ్యాటరీ స్టోరేజీ కింద బల్బు, ఫ్యాన్ సదుపాయం కల్పించాలన్నారు. స్టోర్స్‌లో ఉన్న కరెంటు పరికరాలపై ఆడిట్ నిర్వహించాలని, అవి వాడిన తర్వాతే కొత్తవి కొనుగోలు చేయాలని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో గురువారం సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డితో ప్రత్యక్షంగా, ఈపీడీసీఎల్ సీఎండీ ఫృధ్వితేజ్, ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావుతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. సూర్యఘర్ పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ గృహ సముదాయాలకు దీనికింద సోలార్ విద్యుత్తు అందించాలని ఆదేశించారు. కొండ ప్రాంతంలో సోలార్ ప్యానళ్లను అందజేసినా రాత్రివేళల్లో కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతుందని, అందువల్ల గిరిజన గ్రామాలకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ద్వారా బల్బు, ఫ్యాను అందజేయాలని చెప్పారు. భారీ వర్షాలూ, గాలులకు విద్యుత్ తీగలు తెగిపడే ప్రాంతాల్లోని ప్రజలకు ముందుగా సమాచారం ఇవ్వడం వల్ల మరణాలను నివారించవచ్చని సూచించారు.