మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:19 PM
మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు.

మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి
పాకలలో కలెక్టర్ అన్సారియాతో కలిసి మత్స్యకారులకు చెక్కుల పంపిణీ
అభివృద్ధి పనులు ప్రారంభం
సింగరాయకొండ, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. మండలంలోని పాకల పల్లెపాలెంలో మత్స్యకార సేవలో కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి మంత్రి పాల్గొన్నారు. సింగరాయకొండ, టంగుటూరు మండలాల్లోని 1,556 మంది మత్స్యకారులకు వేట నిషేధ భృతిని కింద రూ.3కోట్ల 11లక్షల 20వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో భృతికింద రూ.20 వేలు మత్స్యకారులకు అందజేశామని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో చంద్రన్న బీమాను, సబ్సిడీలను రద్దుచేసి మత్స్యకారులకు ద్రోహం చేశారని మండిపడ్డారు. పాకల తీరంలో టూరి్‌స్టల రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రూ.15 లక్షలతో వాచ్‌టవర్ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదన్నారు. టంగుటూరు నుంచి పాకలకు రూ.5.5 కోట్లతో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వచ్చే నెలలో తల్లికి వందనం పఽథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూల్‌కి వెళ్తుంటే అందరికీ ఒక్కొక్కరికీ రూ.15 వేలు అందజేస్తామన్నారు.
టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు : కలెక్టర్
పాకలలో టూరిజం, మత్స్యకారుల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. తమిళనాడు నుంచి వస్తోన్న సోనాబోట్ల సమస్యను కూడా అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఏటా మత్స్యరంగంలో 15 శాతం వృద్ధిని సాధించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అనంతరం పాకలలో రూ.1.08 కోట్లతో నిర్మించిన సీసీరోడ్డును కలెక్టర్, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి మంత్రి స్వామి ప్రారంభించారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు, తహసీల్దార్లు రవి, ఆంజనేయులు, ఏఈ వర్షిణి, నియోజకవర్గపరిశీలకులు అడకా స్వాములు, సర్పంచ్ సైకం చంద్రశేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, నేతలు సన్నెబోయిన శ్రీనివాసులు, షేక్ సంధానీబాషా, చీమకుర్తి కృష్ణ, గాలి హరిబాబు, పోతురాజు, కన్నా ప్రసాద్, గ్రామకాపులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
వైద్యశాఖ సమీక్షలో స్వామి
ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సూచించారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సోమవారం జిల్లా వైద్యాధికారి, నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్యాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కొండపి ప్రభుత్వ ఆసుపత్రిలో స్రీ, పురుషుల వార్డులలో చేపట్టాల్సిన మార్పులపై చర్చించారు. ఒంగోలు రిమ్స్‌లో జరుగుతున్న పెయింటింగ్ పనులపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజల వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులకు అధికం నిధులు కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు. వైద్యులు భాధ్యతయుతంగా పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు.