Share News

కోలాహలంగా..

ABN , Publish Date - Aug 03 , 2025 | 02:18 AM

సూపర్‌ సిక్స్‌లో భాగమైన అన్నదాత సుఖీభవ పథకం శనివారం ప్రారంభమైంది. ఏడాదికి అర్హులైన ఒక్కో రైతు కుంటుంబానికి రూ.20వేల వంతున నగదును ఈ పథకం ద్వారా అందిస్తుండగా అందులో పీఎం కిసాన్‌ పథకం నుంచి కేంద్రం రూ.6వేలు, మిగిలిన రూ.14వేలను రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న విషయం విదితమే.

కోలాహలంగా..
బస్సులో వెళ్తున్న సీఎంను చూసి హుషారుగా విక్టరీ చూపుతున్న ప్రజలు

అన్నదాత సుఖీభవ పథకం నగదు అందజేత

తూర్పువీరాయపాలెం నుంచి శ్రీకారం చుట్టిన సీఎం

పాల్గొన్న మంత్రులు అచ్చెన్న, ఆనం, కలెక్టర్‌ అన్సారియా

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల ఆధ్వర్యంలో కార్యక్రమం

ఒంగోలు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : సూపర్‌ సిక్స్‌లో భాగమైన అన్నదాత సుఖీభవ పథకం శనివారం ప్రారంభమైంది. ఏడాదికి అర్హులైన ఒక్కో రైతు కుంటుంబానికి రూ.20వేల వంతున నగదును ఈ పథకం ద్వారా అందిస్తుండగా అందులో పీఎం కిసాన్‌ పథకం నుంచి కేంద్రం రూ.6వేలు, మిగిలిన రూ.14వేలను రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న విషయం విదితమే. అందులో తొలివిడతగా కేంద్రం రూ.2వేలు, రాష్ట్రప్రభుత్వం రూ.5వేలు వెరసి రూ.7వేలను శనివారం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిధులను రైతు ఖాతాల్లో జమచేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. దర్శి నియోజకవర్గం తూర్పువీరాయపాలెం నుంచి దీనిని ప్రారంభించి రాష్ట్రంలో రూ.46.86లక్షల మందికి రూ.3,174.42కోట్ల నగదు పంపిణీకి సంబంధించిన మెగా చెక్‌ను మహిళా రైతులకు అందజేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ పథకం అమలును రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ప్రజాప్రతినిధులు ప్రారంభించేలా ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా జిల్లావ్యాప్తంగా శనివారం ఉదయం కోలాహలంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 2.68లక్షల మందికి రూ.182.74 కోట్లు తొలివిడత జిల్లాకు మంజూరు కాగా ఆ నిధులను ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, అధికారపార్టీ నేతల సమక్షంలో అధికారులు విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో తాను ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విశాఖ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ స్వామి పాల్గొన్నారు. ఆయన ప్రాతినిథ్యం వహించే కొండపి నియోజకవర్గంలోని బిట్రగుంటలో జరిగిన సభలో మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యనారాయణ పాల్గొని పంపిణీ చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మండల కేంద్రమైన కొత్తపట్నంలో జరిగిన సభలో నిధులు విడుదల చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌ చీమకుర్తిలో జరిగిన సభలో, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కనిగిరి పట్టణంలో, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అక్కడి మార్కెట్‌ కమిటీ వద్ద జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నికరంపల్లిలో, వైపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జీ గుడూరి ఎరిక్షన్‌బాబు అమనిగుడిపాడులో పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల్లో స్థానిక నాయకులు పాల్గొని నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల సభలు, సమావేశాలను నిర్వహించారు.

Updated Date - Aug 03 , 2025 | 02:18 AM