Share News

భూగర్భ శోకం

ABN , Publish Date - Apr 29 , 2025 | 01:22 AM

జిల్లాలో వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పలుమండలాల్లో మూడు మాసాలకుపైగా చినుకు లేకపోవడం, అంతకు ముందు ఈశాన్య రుతుపవనాల కాలంలో సగం మండలాల్లో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదవడం అందుకు కారణమైంది.

భూగర్భ శోకం

వేసవి ఆరంభంలోనే పడిపోయిన నీటి మట్టం

జిల్లాలో మార్చి ఆఖరుకు సగటున 16.05 మీటర్లు

మూడు మాసాల్లో ఐదు మీటర్లు తగ్గిన వైనం

దోర్నాలలో 66.97మీటర్లు, మార్కాపురంలో 50.45 మీటర్లకు దిగజారిన పరిస్థితి

పశ్చిమాన పలు గ్రామాల్లో పనిచేయని బోర్లు

93 గ్రామాల్లో వాటి తవ్వకాలు నిషేధం

ఒంగోలు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పలుమండలాల్లో మూడు మాసాలకుపైగా చినుకు లేకపోవడం, అంతకు ముందు ఈశాన్య రుతుపవనాల కాలంలో సగం మండలాల్లో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదవడం అందుకు కారణమైంది. గతంలో అధికారులు నిర్వహించిన సర్వేలో జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 16.05 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం 11.22 మీటర్లకు దిగజారింది. మూడు మాసాల్లోనే సుమారు 5 మీటర్ల మేర పడిపోయింది. జిల్లాలోని పశ్చిమప్రాంతంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. అక్కడ కొన్ని మండలాల్లో భూగర్భ జలమట్టం ఏకంగా 50నుంచి 60 మీటర్ల దిగువకు చేరడం ఆందోళన కలిగిస్తోంది.

వెయ్యి అడుగుల లోతున బోర్లు

జిల్లాలోని అత్యధిక ప్రాంతాలలో ప్రత్యేకించి పశ్చిమంలో సాగు, తాగునీటికి భూగర్భజలాలే దిక్కు. మంచి వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు పెరిగి పంటలకు, తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే అంతంతమాత్రంగా కురిస్తే సంక్రాంతి నుంచే నీటి ఇక్కట్లు ప్రారంభమవుతాయి. దోర్నాల, దొనకొండ, గిద్దలూరు, మార్కాపురం, పుల్లలచెరువు, పెద్దారవీడు, రాచర్ల, తర్లుపాడు, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, కొనకనమిట్ల తదితర మండలాల్లో ఈపరిస్థితి అధికంగా ఉంటుంది. అక్కడ అనేక గ్రామాల్లో మిర్చి, వరి, పత్తి, ఇతర పలు రకాల పంటలు బోర్ల ఆధారంగా వేస్తారు. కొన్ని గ్రామాల్లో 700 నుంచి వెయ్యి అడుగుల లోతులో కూడా బోర్లను తవ్వి నీటిని తీసి పంటలకు పెడుతున్నారు. అలాగే గ్రామాల్లో వెయ్యి అడుగుల లోతున బోర్లు తవ్వి విద్యుత్‌ మోటార్లు ఏర్పాటు చేసి సింగిల్‌ రక్షిత పథకాల (డీ్‌పబోర్ల) ద్వారా ప్రజలకు నీటి అవసరాలను తీర్చుతున్నారు. అలాంటి గ్రామాల్లో భూగర్భ జల మట్టం భారీగా పడిపోయింది. ప్రస్తుతం వ్యవసాయ అవసరాలు పెద్దగా లేక కొంత ఉపశమనంగా ఉన్నప్పటికీ తాగు, ఇతర సాధారణ అవసరాలకు నీరు దొరకడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే పశ్చిమప్రాంతంలోని 9 మండలాల్లోని 51 ఆవాసాల్లో ట్యాంకర్లతో నీటి సరఫరా జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో నీటి లభ్యతకన్నా 300 గ్రామాల్లో అధికంగా భూగర్భ జలాల వాడకం జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. అందులో అత్యధికంగా 93 గ్రామాలు మన జిల్లాలో ఉన్నాయి. పశ్చిమాన 12 మండ లాల్లో ఇవి ఉన్నాయి. ఆ గ్రామాల్లో బోర్ల తవ్వకాలను నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాకు పూర్తి పశ్చిమాన నల్లమల అటవీ సరిహద్దులో ఉన్న దోర్నాల మండలంలో అప్పుడే భూగర్భ జలమట్టం 66.97 మీటర్లకు పడిపోయింది. ఇలా పలు మండలాల్లో ఉండటంతో ఈ వేసవిలో 14 మండలాల్లోని 230 హ్యాబిటేషన్లలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడి ట్యాంకర్లతో సరఫరా చేయాల్సి వస్తున్నదని అధికారులు అంచనా వేశారు.


మరింత పడిపోయే పరిస్థితి

ప్రస్తుత ఎండలు తీరును పరిశీలిస్తే మే, జూన్‌ నాటికి భూగర్భ జలమట్టం మరింత దారుణంగా పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో డిసెంబరు నెలలో 11.22 మీటర్లుగా ఉన్న భూగర్భ జలమట్టం జనవరిలో 11.85 మీటర్లకు, ఫిబ్రవరిలో 14.02 మీటర్లకు, మార్చిలో 16.05 మీటర్లకు పడిపోవడం అందుకు ఊతం ఇస్తున్నది. ఇలా భూగర్భ జల మట్టం తగ్గడంతో పశ్చిమ ప్రాంతంలోని పలు గ్రామాల్లో డీప్‌బోర్లు, వ్యవసాయ బోర్లు పనిచేయక ఇక్కట్లు పడుతున్నారు.

Updated Date - Apr 29 , 2025 | 01:22 AM