Share News

ట్రావెల్‌ బస్సును ఢీకొన్న టిప్పర్‌

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:22 PM

ట్రావెల్స్‌ బస్‌, గ్రావెల్‌ టిప్పర్‌ ఢీకొనడంతో ముగ్గురు ప్రయాణికులతోపాటు బస్‌డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

ట్రావెల్‌ బస్సును ఢీకొన్న టిప్పర్‌
గాయపడ్డ మహిళలు అనూష,శైలజ

నలుగురికి గాయాలు

ముగ్గురిని ఒంగోలు వైద్యశాలకు తరలింపు

ఆందోళనకు గురైన ప్రయాణికులు

నామ్‌ రహదారిపై నిలిచిన ట్రాఫిక్‌

అద్దంకి, ఏప్రిల్‌28 (ఆంధ్రజ్యోతి) : ట్రావెల్స్‌ బస్‌, గ్రావెల్‌ టిప్పర్‌ ఢీకొనడంతో ముగ్గురు ప్రయాణికులతోపాటు బస్‌డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేకు వెంపరాల కొండ నుంచి టిప్పర్‌ గ్రావెల్‌ను తరలిస్తోంది. టిప్పర్‌ నామ్‌ రోడ్డులో సోమవారం వేకువజామున చినకొత్తపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద యూటర్న్‌ తీసుకునే సమయంలో హైదరాబాద్‌ నుంచి కందుకూరు, కామేపల్లి వెళ్తున్న ట్రావెల్స్‌ బస్‌ ఢీకొన్నాయి. దీంతో టిప్పర్‌ నామ్‌ రోడ్డుపై బోల్తా పడింది. ట్రావెల్స్‌ బస్‌ ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో బస్‌లో ప్రయాణిస్తున్న మద్దిపాడుకు చెందిన ఏ. సామ్యూల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చీమకుర్తికి చెందిన జి.అనూష, కొండపికి చెందిన శైలజ, ట్రావెల్స్‌ బస్‌డ్రైవర్‌ కూడా గాయపడ్డారు. సామ్యూల్‌, అనూష, శైలజలను 108 వాహనంలో ఒంగోలులోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. ట్రావెల్స్‌ బస్‌డ్రైవర్‌కు 108 సిబ్బంది స్థానికంగానే ప్రాథమిక చికిత్స నిర్వహించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఆందోళన చెందారు. ఘటనాస్థలాన్ని సీఐ సుబ్బరాజు పరిశీలించారు. టిప్పర్‌ నామ్‌ రోడ్డుపై అడ్డంగా పడిపోవటంతో, ట్రావెల్స్‌ బస్‌ రోడ్డు పైనే నిలిచి పోయింది. దీంతో ట్రాఫిక్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రోడ్డుపై ఉన్న వాహనాలను తొలగింప చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Updated Date - Apr 28 , 2025 | 11:22 PM