Share News

వీరిది కసి.. వారిది ఆశ..

ABN , Publish Date - Apr 29 , 2025 | 01:30 AM

తెలుగుదేశం నాయకుడు వీరయ్యచౌదరి హత్య కేసుకు సంబంధించి సూత్రధారులను గుర్తించి కీలక పాత్రధారులు, కిరాయి హంతకుల కోసం వేట ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా మొత్తం సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు ఒంగోలులోని ఒక హోటల్‌లో ఆరోజు మధ్యాహ్నం ఫుటేజీలో దొరికిన అంశాలపై ప్రత్యేక విచారణ కొనసాగిస్తున్నారు.

వీరిది కసి.. వారిది ఆశ..
వీరయ్య హత్యకు గురైన భవనం వద్ద పోలీసు అధికారులకు సూచనలిస్తున్న ఎస్పీ దామోదర్‌ (ఫైల్‌)

వీరయ్య హత్యకు భారీగా సుపారీ

ఒక్కో కత్తిపోటుకు రూ.2లక్షలని ప్రచారం

చేపల పులుసు కోసమే ఆ హోటల్‌కు వెళ్లామని చెప్పిన వైసీపీ ఎంపీపీ భర్త

ఆ ఇద్దరి కోసం ముమ్మర వేట

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

తెలుగుదేశం నాయకుడు వీరయ్యచౌదరి హత్య కేసుకు సంబంధించి సూత్రధారులను గుర్తించి కీలక పాత్రధారులు, కిరాయి హంతకుల కోసం వేట ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా మొత్తం సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు ఒంగోలులోని ఒక హోటల్‌లో ఆరోజు మధ్యాహ్నం ఫుటేజీలో దొరికిన అంశాలపై ప్రత్యేక విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు ఈ కేసులో ఆర్థిక వనరులు కూడా కొందరు సమకూర్చినట్లు వెల్లడవుతుండటంతో ఆ దిశగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎంత మొత్తంలో వెచ్చించారు, కిరాయి హంతకులకు ఎంత ముట్టజెప్పారు, డబ్బు ఎక్కడెక్కడి నుంచి సమకూర్చుకున్నారు అన్న విషయాలపై విచారణ చేస్తున్నారు. హత్య చేసే క్రమంలో శరీరంపై 50వరకు కత్తి పోట్లు పొడవడంలో ఆంతర్యమేమిటన్న దానిపై కూడా కూపీ లాగుతున్నట్లు తెలిసింది. పోలీసులకు లభించిన ప్రాఽథమిక సమాచారం మేరకు ఈ హత్య కోసం కోట్ల రూపాయలు వెచ్చించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హంతకు లకు నాయకత్వం వహించిన వ్యక్తే భారీమొత్తంలో డబ్బు పొందడంతోపాటు వారికి కూడా కూడా పెద్దఎత్తున చెల్లించి నట్లు భావిస్తున్నారు. పైగా రెండు మూడు నెలల నుంచి సూత్రధారులు, పాత్రధారులు ఇదే పనిలో ఉండటంలో కూడా భారీగా వెచ్చించి ఉండవచ్చన్న అవగాహనకు పోలీసులు వచ్చారు. అంతేకాక ఖరీదైన, పటిష్టమైన ఆయుధాలను కూడా కొనుగోలు చేసుకొని వినియోగించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోటుకు రేటు

వీరయ్యను హత్య చేసిన వారు భారీమొత్తంలో సుపారీ అడిగినట్లుగా పోలీసులు పసిగట్టారు. సూత్రధారులు కూడా ఎలాంటి పరిస్థితుల్లో వీరయ్య తప్పించుకోకూడదని, అతన్ని విచక్షణారహితంగా చంపితే చూడాలన్న కసితో హంతకులు అడిగిన సుపారీకి అంగీకరించి ఉంటారని పోలీసుల అంచనా. ఆ సంద ర్భంగా సాగిన బేరసారాల్లో ఒక్కో కత్తిపోటుకు రూ.5లక్షలు ఇవ్వాలనే డిమాండ్‌ హంతకులు పెట్టినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ విషయంలో తర్జనభర్జన అనంతరం చివరకు రూ.2లక్షలు ఇచ్చే విధంగా ఒప్పందం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శరీరంపై అన్నిచోట్ల పొడిచారని భావిస్తున్నారు. వీరయ్య మెడపైన, గుండెపైన, పొత్తి కడుపునకు పక్కలో లోతుగా దిగిన కత్తిపోట్లకే ఆయన ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని తెలుస్తోంది. హంతకులు తదనంతరం ఎక్కడపడితే అక్కడ కత్తితో పొడవటం, గీయడం చేశారని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన ఒక డాక్టర్‌ 50 పైగా కత్తిపోట్లు ఉన్నాయన్న సమాచారం ఇవ్వడం కూడా గమనార్హం. ఈ కత్తిపోట్ల ఒప్పందం ప్రకారమే రూ.కోటికిపైగా హంతకులకు అందినట్లు పోలీసులు అంచనాలు వేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే 50శాతం డబ్బులు ఇచ్చే ఒప్పందం మేరకు ఆ రోజు రాత్రి వీరికి రూ.40లక్షల నుంచి రూ.50 లక్షలు అందేవిధంగా ఏర్పాటు చేసినట్లు కూడా పోలీసులు విచారణలో నిర్ధారణ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా వీరయ్యను అంతమొందించాలనే కసి, భారీగా సొమ్ము చేసుకోవాలనే హంతకుల ఆశ కలిసి వీరయ్య శరీరంలో భారీగా కత్తిపోట్లతో దాడి చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

చేప పులుసు కోసమే ఆ హోటల్‌కు

హత్య జరిగిన రోజు మధ్యాహ్నం ఒంగోలులో కొత్తగా ప్రారంభించిన ఒక హోటల్‌లో దొరికిన సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు మరికొందరిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేశారు. వైసీపీ మండల ప్రజాప్రతినిధిగా ఉన్న ఒకరు గత ఎన్నికల్లో సొంత మండలంలో టీడీపీకి సహకరించి, ఒంగోలులో వైసీపీ శ్రేణులతో తిరుగుతూ ఇటీవల హోటల్‌ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఆ హోటల్‌ సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఘటన జరిగిన 22వ తేదీ మధ్యాహ్నం ఆ హోటల్‌కు 10 నుంచి 13 మందితో కలిసి వైసీపీ ఎంపీపీ భర్త మధ్యాహ్నం హోటల్‌కు వచ్చారు. కొంత సమయం అటుఇటుగా ఈ హత్యలో సూత్రధారుల్లో ఒకరుగా భావిస్తున్న అమ్మనబ్రోలు వాసి వెళ్లారు. ఆయన సదరు ఎంపీపీ భర్తతో మాట్లాడటం సీసీ పుటేజీలో స్పష్టంగా కనిపించింది. తదనుగుణంగానే ఎంపీపీ భర్తను పోలీసులు పిలిచి విచారణ చేశారు. ఆ హోటల్‌లో చేపల పులుసు బాగుంటుందనే నానుడితో సహచర మిత్రులు వెళ్దామనగా వెళ్లి భోంచేసి బయటకు వచ్చే సమయంలో సదరు నాగులుప్పలపాడు వాసి ఎదురయ్యాడని, ఆయన అన్నా బాగున్నావా అని అడిగితే బాగున్నానని చెప్పి వచ్చేశానే తప్ప ఎటాంటి సంభాషణ అక్కడ జరగలేదని సదరు ఎంపీపీ భర్త పోలీసులకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సూత్రధారుల్లో ఒకరు, ఎంపీపీ భర్త ఒక్క నిమిషంపాటు మాట్లాడుకున్నట్లు కూడా సీసీ కెమెరాల్లో కనిపించింది. దీంతో పోలీసులకు అంతకుముందు ఏడాది క్రితమే అమ్మనబ్రోలులో పెట్రోలు బంక్‌ నిర్వహణకు సంబంధించిన విషయంపై సదరు వ్యక్తితో మట్లాడానే తప్ప ఆ తర్వాత ఎటువంటి ఫోన్‌ సంభాపణ కూడా జరగలేదని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు అతను సెల్‌ఫోన్‌లోని సమాచారం డౌన్‌లోడ్‌ చేసుకొని తదుపరి విచారణ చేపట్టారు. కాగా హోటల్‌ నిర్వాహకుడికి గతంలో పక్క జిల్లాలోని ఆయన మండలంలో ఇసుక వ్యాపారం చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుత కేసు హంతకులకు లీడర్‌గా భావిస్తున్న అనుమానితుడు కూడా ఒంగోలులో ఇసుక వ్యాపారం చేశారు. దీంతో వారి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


గాలింపు ముమ్మరం

ఈ కేసు పూర్తిస్ధాయిలో కొలిక్కి వచ్చేందుకు హైదరాబాద్‌లో ఉన్న అమ్మనబ్రోలుకు చెందిన పారిశ్రామిక వేత్త, హంతక ముఠాకు నాయకత్వం వహించిన ఇసుక వ్యాపారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఇద్దరికి సంబంధించిన సమీప బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పారశ్రామికవేత్త మామ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఆయితే ఈ ఇద్దరు ఘటన జరిగిన రాత్రి కొన్ని గంటల నుంచి వారి కోసం విశాఖ, హైదరాబాద్‌లలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో పురోగతి వచ్చిందనే సమాచారం పోలీసు వర్గాలు తెలుపుతున్నారు. అయితే ఆ ఇద్దరికి చెందిన సమాచారం బయటకు పోక్కకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఈ కేసు పురోగతి సంబంధించి ఏ క్షణంలోనైనా మరింత సమాచారం పోలీసులకు లభించే అవకాశం కనిపిస్తోంది. హంతకుల్లో ఒకరిద్దరు నెల్లూరు ప్రాంతవాసులుగా గుర్తించి అక్కడ కూడా కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Apr 29 , 2025 | 01:32 AM