గాడినపడ్డాయ్!
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:25 AM
వైసీపీ పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రమంగా గాడిలో పెడుతూ వస్తోంది. అందుకు గ్రామ పంచాయతీలే నిదర్శనం. గతంలో పారిశుధ్య పనులకు సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అందుకు భిన్నంగా అందుబాటులో అవసరమైన స్థాయిలో ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి.

పంచాయతీల్లో రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు
గత ఆర్థిక సంవత్సరంలో రూ.21.05 కోట్ల ఆదాయం
మిగిలిన బకాయిలు రాబట్టేందుకు చర్యలు
ఇక నుంచి స్వర్ణాంధ్ర పోర్టల్ ద్వారానే చెల్లింపులు
గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన స్థానిక సంస్థలు
వైసీపీ పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రమంగా గాడిలో పెడుతూ వస్తోంది. అందుకు గ్రామ పంచాయతీలే నిదర్శనం. గతంలో పారిశుధ్య పనులకు సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అందుకు భిన్నంగా అందుబాటులో అవసరమైన స్థాయిలో ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి. దీంతో గ్రామ పంచాయతీలకు మళ్లీ కళ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడంతోపాటు అధికార యంత్రాంగం పన్ను వసూళ్లపై ఒత్తిడి పెంచింది. రాష్ట్రస్థాయి అధికారులతోపాటు కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రత్యేక దృష్టి సారించడంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులు రికార్డుస్థాయిలో వసూలయ్యాయి.
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 28 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఇప్పటివరకు ఎక్కువగా ఆధారపడిన గ్రామ పంచాయతీలకు స్థానికంగానూ పట్టు పెరుగుతోంది. ఈఏడాది అత్యవసరంతోపాటు అభివృద్ధి పనులు చేసుకునేందుకు అవసరమైన నిధులు సమకూరాయి. రికార్డు స్థాయిలో పన్నులు వసూలయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 729 గ్రామ పంచాయతీల్లో రూ.37 కోట్ల పన్నుల డిమాండ్ ఉండగా ఇప్పటివరకు రూ.21.05 కోట్లు వసూలయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.37 కోట్ల డిమాండ్ ఉంటే కేవలం రూ.13.86 కోట్లు మాత్రమే రాబట్టారు. ఆ ప్రకారం చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో 52శాతం అదనంగా ఆదాయం చేకూర్చారు. గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.7.18 కోట్లు ఎక్కువగా వసూలు చేశారు. ఇంకా జిల్లాలో సుమారు రూ.13 కోట్ల మేర పన్నులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇక నుంచి యూపీఐ ద్వారా పన్నులు వసూలు
పంచాయతీల్లోని ప్రజల నుంచి ఇప్పటి వరకు పన్నులను నగదు రూపంలో పంచా యతీ కార్యదర్శులు తీసుకునే వారు. ఇక నుంచి స్వర్ణాంధ్ర పోర్టల్ ద్వారానే వసూలు చేయనున్నారు. స్వర్ణాంధ్ర పోర్టల్‌లో యుపీఐ (ఫోన్ పే), ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా పంచాయతీ అకౌంట్‌కు ఇంటి పన్నులు నేరుగా జమ చేయాల్సి ఉంది. గతంలో ప్రజల నుంచి వసూలు చేసిన నగదును కొంతమంది కార్యదర్శులు పంచాయతీ అకౌంట్‌కు జమ చేయకుండా స్వాహా చేసిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండే విధంగా ప్రభుత్వం ఈ స్వర్ణాంధ్ర పోర్టల్‌ను తెచ్చింది. ఇంకోవైపు ఇప్పటివరకూ వసూలు చేసిన పన్నులకు సంబంధించిన బిల్లులను కూడా స్వర్ణాంధ్ర పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకుంది. అందుకు అవసరమైన దిశానిర్దేశం కూడా చేశారు. గ్రామాల్లో ఇల్లు ఒకరి పేరుతో ఉండి పన్నులు మరొకరు చెల్లిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా స్వర్ణాంధ్ర పోర్టల్‌లో ఆ ఇంటి విస్తీర్ణంతోపాటు ఆ యజమాని పేరును కూడా నమోదు చేయనున్నారు.
బకాయిలన్నీ వసూలు చేశారు
గ్రామ పంచాయతీల్లో ఏళ్ల తరబడి పేరుకు పోయిన బకాయిలను జిల్లా అధికారుల చొరవతో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వసూలు చేశారు. ప్రతి పంచాయతీకి సరాసరిన రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు ఇంటి పన్నుల రూపంలో నిధులు సమకూరాయి. వాటితో వీధి దీపాలతోపాటు పారిశుధ్య నిర్వహణ, బ్లీచింగ్ చల్లడం, బోరింగ్‌లు మరమ్మతులు చేయించడం, ట్యాంకులను శుభ్రం చేయించుకోవడం, అత్యవసరమైన పనులు పంచాయతీ తీర్మానాలతో చేసుకొనేందుకు సాధ్యమవుతుంది.