Share News

డబ్బులిస్తేనే గుర్తింపు

ABN , Publish Date - Aug 03 , 2025 | 02:15 AM

జిల్లాలో ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు విషయంలో భారీ మొత్తాలు చేతులు మారుతున్నాయి. అధికారులు లక్షల రూపాయలు డిమాండ్‌ చేస్తూ యాజమాన్యాలను పీక్కుతింటున్నారు. తాజాగా ఆరు స్కూళ్లకు ప్రభుత్వ గుర్తింపు విషయంలో అధికారుల తీరుపై యాజమాన్యాలు నేరుగా పాఠశాల విద్య కమిషనర్‌ రామరాజుకు ఫిర్యాదు చేయడంతో విషయం రచ్చకెక్కింది.

డబ్బులిస్తేనే గుర్తింపు

ఆరు స్కూళ్లకు రూ.5.50 లక్షలు బేరం

పాఠశాల విద్య కమిషనర్‌కు ఫిర్యాదు

ఆయన ఆగ్రహం... సెలవులో వెళ్లిన ఏడీ-2

జిల్లా విద్యాశాఖలో కలకలం

సిబ్బందితో డీఈవో ప్రత్యేక సమావేశం

ఒంగోలు విద్య, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు విషయంలో భారీ మొత్తాలు చేతులు మారుతున్నాయి. అధికారులు లక్షల రూపాయలు డిమాండ్‌ చేస్తూ యాజమాన్యాలను పీక్కుతింటున్నారు. తాజాగా ఆరు స్కూళ్లకు ప్రభుత్వ గుర్తింపు విషయంలో అధికారుల తీరుపై యాజమాన్యాలు నేరుగా పాఠశాల విద్య కమిషనర్‌ రామరాజుకు ఫిర్యాదు చేయడంతో విషయం రచ్చకెక్కింది. రెండ్రోజుల క్రితం డీఈవో కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లగా మొదట డైరెక్టర్‌ పార్వతి ఈ వ్యవహారంపై సీరియస్‌ అయినట్లు తెలిసింది. ఆతర్వాత రామరాజు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన డీఈవో చర్యలు చేపట్టడంతో సంబంధిత అధికారి అయిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌-2 వెంటనే ఆఫైల్‌కు ఆన్‌లైన్‌లో ఆమోదముద్ర వేసి సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈవ్యవహారం జిల్లా విద్యాశాఖలో సంచలనం సృష్టించింది. విద్యాశాఖలో ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ ప్రారంభ అనుమతి, గుర్తింపు వ్యవహారం మొత్తం ఈ-ఫైల్‌(ఆన్‌లైన్‌) ద్వారానే జరుగుతుంది. మండల స్థాయిలో ఎంఈవో నుంచి నేరుగా సంబంధిత అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (డీఈవో కార్యాలయం)కు, తర్వాత డీఈవోకు అది చేరుతుంది. ఆ ఫైల్‌పై వారు ఆమోదముద్ర వేస్తే సరిపోతుంది. కొత్త విధానంలో డీఈవో కార్యాలయంలోని సంబంధిత సెక్షన్‌ సూపరింటెండెంట్‌, గుమస్తాలకు సంబంధం ఉండదు. తర్వాత ఎప్పుడో ఫిజికల్‌ ఫైల్‌ ఎంఈవో నుంచి డీఈవో కార్యాలయానికి వస్తోంది. అప్పటికే అంతా అయిపోతోంది. ఈ వ్యవహారంలో శుక్రవారం డీఈవో కార్యాలయంలో హైడ్రామా నడిచింది. ఆరు పాఠశాలలకు సంబంధించి ఒక ఫైల్‌ 15 రోజుల క్రితం డీఈవో కార్యాలయంలోని ఏడీ-2 లాగిన్‌కు వచ్చింది. అయితే ఆయన దానిని పట్టించుకోలేదు. ఇటీవల ఆ పాఠశాల యాజమాన్యాలు వచ్చాయి. నేరుగా ఏడీ-2తో సంప్రదింపులు చేశాయి. ఫైళ్లకు అమోదముద్ర వేసేందుకు రూ.5.50 లక్షలకు బేరం కుదిరినట్లు సమాచారం. అనంతరం స్కూళ్ల గుర్తింపునకు డీఈవో కార్యాలయంలో రూ.5.5లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని యాజమాన్యాలు పాఠశాల విద్య కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సీరియస్‌గా తీసుకున్న ఆయన డీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రంగంలోకి డీఈవో.. సెలవులో వెళ్లిన ఏడీ-2

డీఈవో కిరణ్‌కుమార్‌ వెంటనే రంగంలోకి దిగారు. శుక్రవారం సంబంధిత సిబ్బంది, ఏడీ-2ను వాకబు చేయగా ఆ ఫైల్‌ 15 రోజుల క్రితమే ఏడీ-2 లాగిన్‌కు వచ్చినట్లు తేలింది. ఈవిషయంపై డీఈవో మండిపడటంతో ఏడీ-2 తన లాగిన్‌లో ఆఫైల్‌కు ఆమోదముద్ర తెలిపి వెంటనే సెలవుపై వెళ్లిపోయారు. ఆతర్వాత డీఈవో స్థానిక సమగ్ర శిక్ష కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రూ.5.5 లక్షలు ఎవరు డిమాండ్‌ చేశారని ప్రశ్నించారు. సిబ్బంది తమకు తెలియదని ఫిజికల్‌ ఫైల్‌ ఇంకా ఇవ్వలేదని చెప్పడంతో శాంతించారు. ఇలాంటి వ్యవహారాలు ఆఫీసు పరువు తీస్తాయని, విషయం కమిషనర్‌ దృష్టికి కూడా వెళ్లిందన్న ఆయన అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కమిషనర్‌ ఆగ్రహంతో ఆరు పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉత్తర్వులు ఆఘమేఘాలమీద జారీ అయ్యాయి.

Updated Date - Aug 03 , 2025 | 02:15 AM