Share News

సందడిగా పింఛన్‌ల పంపిణీ

ABN , Publish Date - Aug 02 , 2025 | 01:50 AM

సామాజిక పింఛన్‌ల పంపిణీ శుక్రవారం జిల్లావ్యాప్తంగా సందడిగా సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో నెలనెలా 2,84,966 మందికి రూ.124.98 కోట్ల నగదును పింఛన్‌గా అందిస్తోంది. వారితోపాటు ఈనెలలో కొత్తగా 5,174 మందికి స్పౌజ్‌ పింఛన్‌లు మంజూరయ్యాయి.

సందడిగా పింఛన్‌ల పంపిణీ
లబ్ధిదారుకు పింఛన్‌ సొమ్మును అందజేస్తున్న మంత్రి స్వామి

ఈసారి కొత్తగా స్పౌజ్‌ పింఛన్‌లు అందజేత

అందుకోసం సభలు, సమావేశాలు

రెగ్యులర్‌ లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పంపిణీ

పలుచోట్ల ముఖ్యప్రజాప్రతినిధులు హాజరు

సింగరాయకొండ, చిమటలో పాల్గొన్న మంత్రి స్వామి

ఒంగోలు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : సామాజిక పింఛన్‌ల పంపిణీ శుక్రవారం జిల్లావ్యాప్తంగా సందడిగా సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో నెలనెలా 2,84,966 మందికి రూ.124.98 కోట్ల నగదును పింఛన్‌గా అందిస్తోంది. వారితోపాటు ఈనెలలో కొత్తగా 5,174 మందికి స్పౌజ్‌ పింఛన్‌లు మంజూరయ్యాయి. పింఛన్‌ పొందుతున్న భర్త మరణిస్తే దాన్ని భార్యకు ఇస్తోంది. రెగ్యులర్‌ పింఛన్‌ నగదును ఎప్పటిలాగే ఇళ్లకు వెళ్లి సిబ్బంది పంపిణీ చేశారు. స్పౌజ్‌ పింఛన్‌ను లబ్ధిదారులను మాత్రం ఒకచోటకు చేర్చి సభలు, సమావేశాలు నిర్వహించి అందించారు. ఉదయం 7 గంటల నుంచి పంపిణీ ప్రారంభం కాగా 11 గంటలకే 80శాతం మందికి అందించారు. సాయంత్రం ఐదు గంటలకు జిల్లాలో 90.60శాతం మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్‌ల పంపిణీ పూర్తిచేశారు. అందుబాటులో లేని వారికి తర్వాత ఇవ్వనున్నారు. రాష్ట్రమంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి సింగరాయకొండలో జరిగిన స్పౌజ్‌ పింఛన్‌ల పంపిణీ సభలోనూ, మర్రిపూడి మండలం చిమట గ్రామంలో రెగ్యులర్‌ పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌ చీమకుర్తి, మద్దిపాడులలో పాల్గొన్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కనిగిరి పట్టణంలో స్పౌజ్‌ పింఛన్లు, కనిగిరి, హెచ్‌ఎంపాడు మండలాల్లో రెగ్యులర్‌ పింఛన్‌లను పంపిణీ చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంతోపాటు రూరల్‌ మండలం, కేకేమిట్ల మండలాల్లో, పొదిలి నగర పంచాయతీలో పాల్గొన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గిద్దలూరు పట్టణంలో, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి దర్శి పట్టణంలో పింఛన్లు పంపిణీ చేశారు. వైపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు దోర్నాలలో పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల్లో స్థానిక అధికారులు, టీడీపీ నాయకులు ఉత్సాహంగా పింఛన్‌లను పంపిణీ చేశారు.

Updated Date - Aug 02 , 2025 | 01:50 AM