Share News

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం

ABN , Publish Date - Aug 03 , 2025 | 02:14 AM

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో రాష్ట్రశాఖ పిలుపు మేరకు జిల్లాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ కె.ఎర్రయ్య అధ్యక్షత వహించారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించకపోతే ఉద్యమన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు.

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

ఫ్యాప్టో నాయకుల హెచ్చరిక

కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా

ఒంగోలు విద్య, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో రాష్ట్రశాఖ పిలుపు మేరకు జిల్లాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ కె.ఎర్రయ్య అధ్యక్షత వహించారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించకపోతే ఉద్యమన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నపాటి మంజుల మాట్లాడుతూ విద్యా శాఖ మంత్రి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపకపోగా, సమస్య లను కూడా పరిష్కరించడం లేదన్నారు. ఆ విషయంలో గత ప్రభుత్వా నికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఏమీ లేదని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాలను సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు బి.వెంగళరెడ్డి మాట్లాడుతూ అన్ని వ్యాధులకు అన్ని ఆస్పత్రులలో మెరుగైన వైద్యం లభించేలా హెల్త్‌కార్డులను వినియోగంలోకి తేవాలన్నారు. ఎంఈవోల సంఘ రాష్ట్ర నాయకుడు బి.కిషోర్‌బాబు మాట్లాడుతూ ఎంఈవో పోస్టుల భర్తీలో, ఇన్‌చార్జిలు ఇచ్చే క్రమంలో జీవో నంబరు 73 ప్రకారం ఉమ్మడి సీనియారిటీ ప్రాతిపదికన తీసుకోవాలని కోరారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు షేక్‌ అబ్దుల్‌హై మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఇచ్చిన 53 జీవోను అమలు చేస్తూ 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్‌ను వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. వెంటనే పీఆర్సీ కమిషన్‌ నియమించి 3 శాతం ఐఆర్‌ ప్రకటించాలని, పెండింగ్‌ డీఎలు మంజూరు చేయాలని, గత పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పీ4 కార్యక్రమం నుంచి టీచర్లను మినహాయించాలని కోరారు. హైస్కూలు ప్లస్‌లకు టీచర్లను కేటాయించాలని, టీచర్లకు బోధనేతర పనులను అప్పగించరాదని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు డి.వీరాంజనేయులు, డి.శ్రీనివాసులు, ఎస్‌కేఎండి రఫీ, బి. వెంకట్రావు, పి.వెంకట్రావు, ఎస్‌.రవి, చల్లా శ్రీనివాసులు, ఎంఈవో నాగేంద్రవదన్‌, సుబ్బారావు, చిన్నస్వామి, మామహేశ్వరి, తిరుపతి, బషీరా తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 02:14 AM