రైతును రాజును చేస్తా
ABN , Publish Date - Aug 03 , 2025 | 02:20 AM
రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి అనువైన పంటల ద్వారా లాభాల బాటలో నడిచే విధంగా చైతన్యవంతులను చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దర్శి మండలం తూర్పువీరాయపాలెం గ్రామం వద్ద పచ్చని పొలాల్లో శనివారం ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. గ

సూపర్‌సిక్స్ పథకాల అమలు సంతోషాన్నిస్తుంది
అన్నదాత సుఖీభవతో వారి కళ్లల్లో ఆనందం
పంటల సాగులో సాంకేతిక పరిజ్ఞానం
తూర్పువీరాయపాలెం ముఖాముఖిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
దర్శి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి అనువైన పంటల ద్వారా లాభాల బాటలో నడిచే విధంగా చైతన్యవంతులను చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దర్శి మండలం తూర్పువీరాయపాలెం గ్రామం వద్ద పచ్చని పొలాల్లో శనివారం ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రత్యేక శైలిలో సీఎంతోపాటు రైతులు నులక, నవారు మంచాలపై కూర్చునే విధంగా వేదికను ఏర్పాటు చేశారు. సూపర్‌సిక్స్ పథకాల అమలులో భాగంగా రైతుల సమక్షంలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 46,85,838 మంది రైతులకు రూ.3,175 కోట్ల మేర చెక్కును అందజేశారు. రైతును రాజును చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలుతో కర్షకుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు. దర్శి మండలం తూర్పువీరాయపాలెంలో శనివారం జరిగిన రైతులతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. సూపర్‌సిక్స్ అమలు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో గత ప్రభుత్వానికి కూటమి పాలనకు మధ్య గల వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. నాగలి పట్టిన రైతన్న బాగుండాలన్నదే తమ లక్ష్యమని, తాను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నానని చెప్పారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలులో సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరికైనా డబ్బులు పడకపోతే ఆ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని చెప్పారు.
15 నుంచి మహిళలకు ఉచిత బస్సు
ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఈనెల 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మహిళలకు పెద్దన్నగా ఎన్నో పఽథకాలు ఆరంభించి అమలు చేశానన్నారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాల ఏర్పాటు, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ల పంపిణీని దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రప్రఽథమంగా తామే అమలు చేశామన్నారు. తల్లికి వందనం పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడంతో మహిళల్లో ఆనందం చూశామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి కుటుంబంలో ఒక విద్యార్ధికి మాత్రమే అమలు చేసిందని విమర్శించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి పథకాన్ని అమలు చేశానన్నారు. కొన్ని కుటుంబాల్లో అత్యధికంగా ఎనిమిది మందికి కూడా తల్లికి వందనం ద్వారా లబ్ధి చేకూరడం సంతోషకరమన్నారు.
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాం
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు. రూ.273 కోట్లతో పొగాకును కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామన్నారు. చిత్తూరులో మామిడి రైతులకు టన్నుకు రూ.4వేలు చొప్పున ప్రోత్సాహం అందించామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48గంటల్లోనే రైతులకు డబ్బులు అందించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
2027 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు తెలిపారు. 1996లో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని తానే ఆరంభించానని, వచ్చే సీజన్ నాటికి మొదటి దశ పూర్తిచేసి కృష్ణా జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సాగునీటి సమస్య తలెత్తకుండా ఎత్తిపోతల పథకాలను అభివృద్ధి చేస్తామన్నారు.
రిజర్వాయర్లు కళకళలాడటం ఆనందదాయకం
ముందుచూపుతో అన్ని రిజర్వాయర్లకు నీరు వదలడంతో 700 టీఎంసీల నిల్వలతో కళకళలాడుతున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. శ్రీశైౖలం, నాగార్జునసాగర్, పులిచింతల, కాటన్ బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్, సోమశిల ప్రాజెక్టులలో నీరు సమృద్ధిగా ఉందన్నారు. భవిష్యత్తులో తాగు, సాగునీటి సమస్య తలెత్తకుండా నదుల అనుసంధానం చేస్తామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 2019 వరకు సాగునీటి రంగానికి రూ.68 వేల కోట్లు ఖర్చుచేయగా గత వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.12వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఉచిత బీమా పథకాన్ని గత పాలకులు నాశనం చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి పునరుద్ధరించామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, రాష్ట్ర వ్యవసాయ మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, జేసీ గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పాల్గొన్నారు.