మిలటరీ మద్యం పేరుతో మోసం
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:19 AM
ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. బ్యాంక్ లోన్ల పేరుతో సైబర్ నేరాలు అధికమయ్యాయి. ఈ తరుణంలో అటువంటి మోసానికే ఓ వైసీపీ కార్యకర్త తెరతీశాడు. తక్కువ రేటుకే మిలటరీ మద్యం సరఫరా చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు.

వైసీపీ కార్యకర్త ఆన్‌లైన్ దందా
సొంతపార్టీ నేతలే బాధితులు
వేలల్లో వసూలు.. రూ.వందల్లో చెల్లింపులు
పెద్దారవీడు, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. బ్యాంక్ లోన్ల పేరుతో సైబర్ నేరాలు అధికమయ్యాయి. ఈ తరుణంలో అటువంటి మోసానికే ఓ వైసీపీ కార్యకర్త తెరతీశాడు. తక్కువ రేటుకే మిలటరీ మద్యం సరఫరా చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. బయట వాళ్లను ఎందుకులే అనుకున్నాడో ఏమో సొంత పార్టీ నేతలనే ఎంచుకున్నాడు.
మోసం చేసేది ఇలా..
వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం నాణ్యతా లోపంగా ఉండేదనే విషయం ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పేవారు. దీంతో అప్పట్లో మిలటరీ మద్యానికి డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే మార్కాపురం ప్రాంతంలో ఎక్కువ మంది మద్యం ప్రియులు మిలటరీ మద్యం పట్ల ఆసక్తి చూపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ ద్వారా నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెచ్చింది. దీంతో మిలటరీ మద్యానికి కొంతమేర డిమాండ్ తగ్గింది. అయినప్పటికీ మండలంలోని బోయదుంపల (వై.డీ.పాడు) చెందిన ఒక వైసీపీ కార్యకర్త తక్కువ ధరకే మిలటరీ మద్యం సరఫరా చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడని పలువురు వైసీపీ నాయకులే చెప్తున్నారు. దీని కోసం సదరు వ్యక్తి వైసీపీలోని కొందరితో ఓ గ్రూపు ఏర్పాటు చేశాడు. ఆ గ్రూపునకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నాడు. తన పేరు, ఇంటి పేరు, మాజీ ముఖ్యమంత్రి పేరుతో కలిసి వచ్చేలా పేరు పెట్టున్నాడు. ఆ గ్రూపులో ఉన్న ఫోన్ నంబర్లకు వ్యక్తిగతంగా తక్కువ ధరకే మిలటరీ మద్యం పేరుతో సందేశాలు పంపుతున్నాడు. ఆ మద్యం కొనుగోలుకు ఆసక్తిచూపిన వారి నుంచి ముందుగానే డబ్బులు తీసుకొని సరఫరా మాత్రం చేయడం లేదు. దీంతో పలువురు బాధితులు లబోదిబోమంటున్నారు.
పెద్దారవీడు నుంచి మార్కాపురం వరకు బాధితులే..
సదరు వ్యక్తి బాధితులు ఇటు పెద్దారవీడు నుంచి మార్కాపురం వరకు ఉన్నారు. మిలటరీ మద్యం తక్కువకు వస్తుందన్న ఆశతో వైసీపీ నాయకులు సదరు ఆర్థిక నేరగానికి వేలల్లో డబ్బులు ఫోన్‌పే, గూగుల్ పేల ద్వారా పంపారు. మద్యం కోసం మళ్లీ ఫోన్ చేస్తే దొరకడు. ఎలాగోలా పట్టుకున్నా, కొద్దోగొప్పో తిరిగి ఇచ్చి మీ ప్రాప్తం ఇంతే అంటూ సర్దిపుచ్చుతున్నారు. సదరు ఆర్థిక నేరగానికి బాధితుల్లో వైసీపీ పెద్దారవీడు మండల మాజీ అధ్యక్షుడు, కలనూతల, మద్దలకట్ల, తమ్మడపల్లి గ్రామాలకు చెందిన పలువురు సర్పంచులు వారి అనుచరులు కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద మిలటరీ మద్యం పేరుతో సదరు వైసీపీ కార్యకర్త ఇప్పటికే లక్షల్లో వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది.