Share News

రైతు నేస్తంలా..

ABN , Publish Date - Aug 03 , 2025 | 02:24 AM

అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్నంగా నిర్వహించిన పొలంబాట కార్యక్రమం సత్ఫలితాన్నిచ్చింది. ఆరంభంలో ఆశ్చర్యశకితులైన ప్రజలు అంతలోనే అర్థం చేసుకుని బెరుకు లేకుండా సీఎంకు సమస్యలు వివరించుకోగలిగారు. అభిమానులు, పార్టీశ్రేణులు ఆయన దగ్గరకు వెళ్లి కరచాలనం చేయగలిగారు.

రైతు నేస్తంలా..
తూర్పువీరాయపాలెం వద్ద పొలాల మధ్యలో మంచంపై కూర్చొని రైతులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, పక్కన మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం, ఎంపీ మాగుంట, దర్శి ఇన్‌చార్జి లక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు

బాబు పొలంబాట సక్సెస్‌

బెరుకు లేకుండా సమస్యలు చెప్పుకున్న ప్రజలు

సీఎంకు కరచాలనం చేసిన పార్టీ శ్రేణులు

వీరాయపాలెం సమస్యలకు అక్కడే పరిష్కారం

దర్శి అభివృద్ధిపై బస్సులో సమీక్ష

నాలుగు ప్రధాన పనులకు అభయం

అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్నంగా నిర్వహించిన పొలంబాట కార్యక్రమం సత్ఫలితాన్నిచ్చింది. ఆరంభంలో ఆశ్చర్యశకితులైన ప్రజలు అంతలోనే అర్థం చేసుకుని బెరుకు లేకుండా సీఎంకు సమస్యలు వివరించుకోగలిగారు. అభిమానులు, పార్టీశ్రేణులు ఆయన దగ్గరకు వెళ్లి కరచాలనం చేయగలిగారు. అటు కోట్ల రూపాయల వ్యయం నివారించడంతోపాటు ప్రజలకు సీఎం చేరువయ్యే విధంగా కార్యక్రమం జరగడం విశేషం. అందుకే ప్రజలు, పార్టీశ్రేణుల నుంచి అనూహ్యమైన సమస్యలు, ప్రశ్నలు కూడా ముఖ్యమంత్రికి ఎదురయ్యాయి. అయినా వారికి అడ్డంకులు చెప్పనీయకుండా మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు.

(ఒంగోలు, ఆంధ్రజ్యోతి)

అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవం రాష్ట్ర వ్యాప్త కార్యక్రమమైనప్పటికీ నిర్వహణ తీరు స్థానిక ప్రజలను ముఖ్యమంత్రికి చేరువ చేసింది. కార్యక్రమం జరిగిన తూర్పువీరాయపాలెంలో సమస్యలకు పరిష్కారం అక్కడికక్కడే లభించింది. దర్శి అభివృద్ధిపై బస్సులో అక్కడి టీడీపీ ఇన్‌చార్జితో సీఎం సమీక్ష చేయడం, కొన్ని పనుల అమలుకు హామీ ఇవ్వడం విశేషం. వెలిగొండ ప్రాజెక్టు అంశాన్ని బహిరంగంగానే చర్చించిన చంద్రబాబు... వివిధ రకాల పంటలకు గిట్టుబాటు ధరల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించడానికి ప్రాధాన్యం ఇచ్చారు.

పైన ఎండ.. చుట్టూ సాధారణ రైతులు

అనూహ్యంగా శనివారం ఎండ తీవ్రత కనిపించింది. దీంతో కొన్ని గంటలపాటు సీఎం ఎండలో ఉండలేరని జిల్లా అధికారులు టెంట్‌లు వేసేందుకు అనుమతి కోరినా ఫలితం లభించలేదు. ఉదయం 11:20 గంటలకు వీరాయపాలెం పొలంలోకి చంద్రబాబు వచ్చిన సమయానికి ఎండ తీవ్రత ఉంది. కార్యక్రమంలో పాల్గొన్న చాలామంది నాయకులు, రైతులు తలపై కండువాలు కప్పుకోక తప్పలేదు. అనుక్షణం చెమటను తుడుచుకుంటూ ఇబ్బందిపడటం కనిపించింది. కానీ చంద్రబాబునాయుడు రమారమీ రెండు గంటల సమయం ఆ ఎండలో ఉన్నా ఇబ్బందిపడటం కానీ, చెమటకు చిరాకుపడటం కానీ కనిపించలేదు. కాసేపు తన పక్కన ఎంపీ మాగుంట, దర్శి టీడీపీ ఇన్‌చార్జీ లక్ష్మీని కూర్చోబెట్టుకున్న తదంతర కార్యక్రమానికి వచ్చిన సాధారణ మహిళ వ్యక్తులను పక్కన కూర్చోబెట్టుకుని కార్యక్రమం నిర్వహించారు. ఎండకు కొంతమంది నాయకులు, అఽధికారులైతే పక్కకు వెళ్లి సేదతీరడం కనిపించింది, కానీ చంద్రబాబు మాత్రం ప్రసంగించే సమయంలో కానీ రైతులతో ముఖాముఖి మాట్లాడే సమయంలో కానీ ఎలాంటి ఇబ్బందిని ప్రదర్శించకపోవడం విశేషం. అలా సీఎం సాధారణ వ్యక్తిలా మారిపోవడంతో ధైర్యం తెచ్చుకున్న ప్రజలు పోటీపడి వారి సమస్యలను వివరించగలిగారు. సహజంగా ఇలాంటి కార్యక్రమాల్లో అధికారులు ఎంపిక చేసిన ముగ్గురు లేక నలుగురు మాట్లాడతారు. అలా ఎంపిక చేసిన రైతులను పక్కనపెడుతు ఆ ముగ్గురే కాకుండా కార్యక్రమంలోనే ఆ తరువాత తన వాహనం వరకు నడిచి వెళ్లే చంద్రబాబు దృష్టికి పలువురు తమ సమస్యలు తీసుకువెళ్లగలిగారు. కార్యక్రమం జరిగిన తూర్పువీరాయపాలెం సమస్యలపై గొట్టిపాటి లక్ష్మీ ఒక నివేదిక ఇచ్చినప్పటికీ, అక్కడకు వచ్చిన గ్రామస్థులు అనేక సమస్యలను ప్రస్తావించారు. గ్రామంలో రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, ఒక లింకు రోడ్డు నిర్మాణంతోపాటు అక్కడిక్కడే ఆదేశాలిచ్చిన చంద్రబాబు 93మందికి పక్కాగృహాలను మంజూరు చేశారు. తూర్పు వీరాయపాలెం నుంచి సామంతిపూడి వరకు రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం విశేషం,

సమస్యలను విని ఆప్యాయంగా పలకరించి..

కార్యక్రమం నిర్వహణ అనంతరం తన వాహనం వరకు ఆయన నడిచి వెళ్లేటప్పుడు ఎదురొచ్చిన పార్టీశ్రేణులు అభిమానుల నుంచి కూడా ఆయన వినతిపత్రాలు తీసుకున్నారు. ఒక టీడీపీ నాయకుడు గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు రాక ఆర్థికంగా చితికిపోయిన విషయాన్ని ధైర్యంగా వివరించగలిగితే ఆప్యాయంగా వారి సమస్యలను విని ఓర్పుగా సమాధానాలు ఇవ్వడం ఆకట్టుకుంది. ఒక సామాన్య కుటుంబ సభ్యులంతా నడిచి వచ్చి వారి భూ సమస్య అపరిష్కృతంగా ఉన్నట్లు వివరించగా కలెక్టర్‌ను పిలిచి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. ఆ తరువాత ఆ అర్జీదారులు సీఎం పొలంబాట రాబట్టే మా సమస్య చెప్పుకునే అదృష్టం వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

దర్శి సమస్యలపై సమీక్ష

అమరావతిలో ముఖ్యమైన సమావేశానికి వెళ్లేందుకుగానూ స్థానికంగా కొన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్న చంద్రబాబునాయుడు స్థానిక అంశాలను పక్కనపెట్టకుండా దర్శి నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేకంగా సమీక్ష చేయడం విశేషం. కార్యక్రమం ఆది నుంచి హెలిప్యాడ్‌లో వెళ్లే వరకు దర్శి టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మీ ఆమె భర్త లలిత్‌సాగర్‌తో దర్శి సమస్యలపై మాట్లాడారు. సుమారు 10 శాశ్వత అభివృద్ధి పనుల గురించి వినతిపత్రాన్ని వారు ముఖ్యమంత్రికి అందజేశారు. వాటిపై డా.లక్ష్మీ వివరణ ఇచ్చిన తరువాత కొన్ని పనులను పూర్తి చేద్దామని హామీ ఇచ్చారు. పక్కనే ఉన్నా సీఎంవో అధికారికి ఇందులో కనీస నాలుగు అభివృధ్ది పనులు వెంటనే పూర్తిచేయాలంటూ అందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేశారు, కోల్డేజీ నిర్మాణం, మన్నేపల్లి, బోధనంపాడు, రామాపురంలో కొత్త ఎత్తిపోతల పథకం నిర్మాణం, మారెళ్ల ఎత్తిపోతల పఽథకం మరమ్మతులకు నిధులు ఇవ్వడంతో పాటు సాగర్‌ కాలువ ఆధునీకరణకు మరిన్ని నిధులు ఇవ్వాలని లక్ష్మీ ఆయన్ని కోరారు. గత టీడీపీ ప్రభుత్వం చేపట్టి వైసీపీ నిలిపివేసిన అభివృద్ధి పనులను ప్రత్యేకంగా ప్రస్తావిస్తు డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్మాణం. సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు, డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణాల నిధులు, బస్‌ డిపో నిర్మాణం, తెన్నేటి మంచినీటి పథకం మరమ్మతులు నిధులతోపాటు, దొనకొండ, దర్శి, పసుపుగల్లు, ఈదరల మధ్య రహదారి నిర్మాణం కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆ ఆంశాలపై వారు లక్ష్మీ ఇచ్చిన వివరణ అనంతరం ఇందులో డ్రైవింగ్‌ స్కూల్‌తోపాటు మూడు, నాలుగు పనులు ముందుగా పూర్తిచేద్దామని అంటూ అవసరమైతే చర్యలు తీసుకోవాలని సీఎంవోకు ఆదేశాలిచ్చారు. ఇలా సీఎం చంద్రబాబునాయుడు ఉన్నంత సమయంలో ప్రజలతో మమేకమయ్యేందుకు స్థానిక సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారించేందుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ హంగు ఆర్భాటాలు లేకుండా అనవసరపు వ్యయాన్ని నివారిస్తు నిర్వహించిన తూర్పు వీరాయపాలెం కార్యక్రమం సత్ఫలితాన్నిచినట్లు చెప్పుకోవచ్చు.

Updated Date - Aug 03 , 2025 | 02:24 AM