ఉపాధి పనుల్లో బోగస్ మస్టర్లు
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:20 AM
ఉపాధి హామీ పథ కం పనుల్లో బోగస్ మస్టర్లతో ప్రభుత్వ ధనాన్ని మెక్కేసిన ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్‌కు మండల అధికారులు సిఫార్సు చేశారు. సోమవారం మండలంలోని మర్రివేములలో 15 మంది ఉపాధి కూలీలు హాజరైతే 250కి మందికి పైగా వచ్చినట్లు దొంగ మస్టర్లు వేస్తున్నారని డ్వామా పీడీ జోస్‌ఫకుమార్‌కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.

వచ్చింది 15 మంది కూలీలు, చూపింది 250 మంది
డ్వామా పీడీకి గ్రామస్థుల ఫిర్యాదు
ఎంపీడీవోకు విచారణ నివేదిక ఇచ్చిన ఏపీవో
ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్‌కు సిఫార్సు
రూ.200 వసూలు చేస్తున్నట్లు సీఎంవోకూ ఫిర్యాదు
పుల్లలచెరువు, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పథ కం పనుల్లో బోగస్ మస్టర్లతో ప్రభుత్వ ధనాన్ని మెక్కేసిన ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్‌కు మండల అధికారులు సిఫార్సు చేశారు. సోమవారం మండలంలోని మర్రివేములలో 15 మంది ఉపాధి కూలీలు హాజరైతే 250కి మందికి పైగా వచ్చినట్లు దొంగ మస్టర్లు వేస్తున్నారని డ్వామా పీడీ జోస్‌ఫకుమార్‌కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీవోపై పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఏపీవో విచారణ చేపట్టగా.. దొంగ ఫొటోలతో మస్టర్లు వేశారని గుర్తించి ఎంపీడీవోకు నివేదిక అందజేశారు. ఎంపీడీవో బీ శ్రీనివాసులు ఏపీవో నివేదిక ఆధారంగా మర్రివేముల ఫిల్డ్ అసిస్టెంట్ సుబ్బారావును సస్పెండ్ చేయాలని కోరుతూ పీడీకి లేఖ రాశారు. గతవారం ఇదే గ్రామంలో ఉపాధి కూలీల నుంచి రూ.200 అక్రమంగా వసూలు చేస్తున్నారని సీఎంవోకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే మండలంలోని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్‌లు, టెక్నికల్ అసిస్టెంట్లు కుమ్మక్కై ఉపాధి కూలీల డబ్బులు మెక్కేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.