సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Aug 02 , 2025 | 01:51 AM
సీఎం చంద్రబాబునాయుడు పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కీలకమైన అన్నదాన సుఖీభవ పథకాన్ని దర్శి మండలం తూర్పువీరాయపాలెం వద్ద సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభిస్తున్న విషయం విదితే.

నూతన హెలిప్యాడ్‌ను సిద్ధంచేసిన అధికారులు
సర్వాంగ సుందరంగా కార్యకర్తల సమావేశం వేదిక
పొలాల్లో పైర్ల మధ్య మంచాలపై రైతులతో ముఖాముఖి
దర్శి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడు పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కీలకమైన అన్నదాన సుఖీభవ పథకాన్ని దర్శి మండలం తూర్పువీరాయపాలెం వద్ద సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభిస్తున్న విషయం విదితే. ఈ నేపథ్యంలో అక్కడ మూడు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రకారం సీఎం చంద్రబాబు తూర్పువీరాయపాలెం గ్రామం వద్ద రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అక్కడే అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. చుట్టుపక్కల ఉన్న పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. సీఎం పర్యటన సుమారు నాలుగు గంటలపాటు సాగనుంది. ఈ నేపథ్యంలో మంత్రులు డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, రవికుమార్, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్ నిరంతరం ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. జిల్లా యంత్రాంగమంతా దర్శిలో ఉండి ఏర్పాట్లలో నిమగ్నమైంది. సీఎం కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి శ్రేణులు, ప్రజలు అధికసంఖ్యలో తరలివస్తున్నారు. అందుకు అనుగుణంగానే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శి-తూర్పుగంగవరం రోడ్డులో తూర్పువీరాయపాలెం గ్రామానికి సమీపంలో నూతనంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడికి కొద్దిదూరంలో సమావేశం నిర్వహిస్తారు. గ్రామం వద్ద పొలాల్లో పచ్చని పైర్ల మధ్య రైతులతో ముఖాముఖికి ఏర్పాట్లు చేశారు. సీఎం, రైతులు కూర్చునేందుకు ప్రత్యేకంగా నులకమంచాలు తెప్పించారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు స్వామి, రవికుమార్
సీఎం చంద్రబాబు పర్యటన సాగే ప్రదేశాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం పరిశీలించారు. తొలుత హెలిప్యాడ్‌ను సందర్శించారు. అక్కడ పరిసరాలను పర్యవేక్షించారు. అనంతరం కార్యకర్తల సమావేశం కోసం ఏర్పాటు చేసిన వేదికను పరిశీలించారు. అక్కడ నిర్వాహకులకు వారు పలు సూచనలు చేశారు. అక్కడి నుంచి రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించే వేదిక ప్రదేశానికి చేరుకున్నారు. ఏర్పాట్లను చూసి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్ దంపతులు, ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, వ్యవసాయ మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిలతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ప్రణాళికాబద్ధంగా కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. సీఎం హెలిప్యాడ్ వద్దకు చేరుకోగానే అక్కడ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరినీ అందుబాటులో ఉంచే విధంగా ఆలోచన చేస్తున్నారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యకర్తల సమావేశానికి ఎంతమందిని పంపాలన్న విషయంపై చర్చించారు.
సీఎం పర్యటన షెడ్యూల్ ఇదీ..
సీఎం చంద్రబాబు శనివారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరుతారు.
ఉదయం 10.35 నుంచి 10.45 మధ్య దర్శి మండలం తూర్పువీరాయపాలెం సమీపంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి కారులో 10.50కు అన్నదాత సుఖీభవ కార్యక్రమ వేదిక వద్దకు వస్తారు.
11 నుంచి 1.15 గంటల వరకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలు సందర్భంగా రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1.15 నుంచి 1.45 వరకు సీఎం సమయం రిజర్వు చేశారు.
1.50 నుంచి 2.50 గంటల వరకు కార్యకర్తల సమావేశంలో మాట్లాడి దిశానిర్దేశం చేస్తారు.
2.50 గంటలకు రోడ్డుమార్గాన బయల్దేరి 2.55కు హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు
3 గంటలకు హెలికాఫ్టర్‌లో ఇక్కడ నుంచి బయల్దేరి 3.40 గంటలకు ఉండవల్లి చేరుకుంటారు.