Share News

ఆశాదీపం

ABN , Publish Date - Aug 02 , 2025 | 01:55 AM

జిల్లా సమగ్రాభివృద్ధి సాధనకు ప్రాజెక్టులు ప్రధానం. మౌలిక వసతులు, ఉపాధి కల్పన కూడా కీలకమే. ఆ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. జిల్లాకే ప్రాణప్రదమైన వెలిగొండను పూర్తిచేయడంతోపాటు దాని ఆధారంగా అన్ని ప్రాంతాలకు కృష్ణా జలాలను తరలించేలా సమగ్ర కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

ఆశాదీపం
వెలిగొండ మొదటి సొరంగం

సమగ్ర నీటిపారుదల ప్రణాళికతోనే భవిష్యత్‌

వ్యవసాయం, పాడి పరిశ్రమకు నీరే ప్రధానం

గ్రామీణ ప్రజలకు ఆ రెండింటితోనే ఉపాధి

వెలిగొండ పూర్తి, డెయిరీ పునరుద్ధరణ కీలకం

మైక్రో ఇరిగేషన్‌తోనూ ఎంతో మేలు

గోదావరి-బనకచర్ల తరహాలో జిల్లాలోని నీటి వనరుల అనుసంధానం అవశ్యం

రెండేళ్ల క్రితం ప్రాజెక్టులపై యుద్ధభేరి వర్క్‌షాపులో హామీ ఇచ్చిన చంద్రబాబు

నేడు దర్శిలో అన్నదాత సుఖీభవ ప్రారంభం

హాజరుకానున్న ముఖ్యమంత్రి, మంత్రులు

జిల్లా సమగ్రాభివృద్ధి సాధనకు ప్రాజెక్టులు ప్రధానం. మౌలిక వసతులు, ఉపాధి కల్పన కూడా కీలకమే. ఆ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. జిల్లాకే ప్రాణప్రదమైన వెలిగొండను పూర్తిచేయడంతోపాటు దాని ఆధారంగా అన్ని ప్రాంతాలకు కృష్ణా జలాలను తరలించేలా సమగ్ర కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఒకప్పుడు పాడి రైతులకు బాసటగా నిలిచిన ఒంగోలు డెయిరీని పునరుద్ధరించే చర్యలను ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్‌ వాటిని పూర్తిచేస్తామని హామీలు ఇచ్చారు. రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ అమలును ప్రారంభించేందుకు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆర్థికాభివృద్ధికి ఉపకరించేలా సమగ్ర నీటి పారుదల ప్రణాళిక, ఒంగోలు డెయిరీ పునరుద్ధరణపై సీఎం స్పష్టత ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు వ్యవసాయం, పాడిపరిశ్రమ రంగాలకు పూర్తి భరోసా ఇవ్వాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

ఒంగోలు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అత్యధిక శాతం ప్రజానీకానికి వ్యవసాయం, పాడి పరిశ్రమే ప్రధాన ఉపాధి మార్గాలు. అవసరమైన మేర వర్షాలు కురవక, తగినంతగా సాగునీటి సౌకర్యం లేక గ్రామీణులు నష్టపోతున్నారు. ప్రతి ఐదేళ్లలో కనీసం రెండేళ్లు వర్షాభావం, కరువు ఆ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో గ్రామీణ ప్రాంత వ్యవసాయ కుటుంబాల పరిస్థితి తల్లకిందులవుతోంది. జిల్లాలో విస్తారంగా వనరులు ఉన్నప్పటికీ వాటికి నీరు చేరేలా, చేరిన నీటిని పొలాలకు మళ్లించే క్రమపద్ధతి చర్యలు లేవు. దీంతో భారీవర్షాలు కురిసిన సమయంలో అధికశాతం నీరు వాగులు, వంకల ద్వారా సముద్రం పాలవడం, వర్షాలు లేనప్పుడు కరువు బారిన పడటం షరామామూలైంది. దీని నుంచి బయటపడి వ్యవసాయం, పాడి పరిశ్రమను రక్షించుకోవాలంటే జిల్లాలో నీటి వనరులన్నింటినీ ప్రతిపాదిత గోదావరి-బనకచర్ల తరహాలో అనుసంధానం చేయగలిగితే భవిష్యత్‌లో జిల్లా నుంచి కరువును పారదోలే అవకాశం ఉంది. ఇందులో వెలిగొండ ప్రాజెక్టు కీలకం కానుంది. ప్రస్తుత జిల్లాలో అత్యధిక భాగం పశ్చిమ ప్రాంతం కాగా వెయ్యి అడుగుల లోతున వేసిన బోర్లలో సైతం నీరు రాని పరిస్థితి. ప్రధాన సాగునీటి వనరులు ఆ ప్రాంతంలో లేక వర్షాలపైనే సాగుకు ఆధారపడుతున్నారు. అలాగే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరిస్థితిని పరిశీలిస్తే ప్రధాన సాగునీటి వనరుగా సాగర్‌కాలువ ఉండగా పర్చూరు ప్రాంతంలో కృష్ణా, పశ్చిమ కాలువలు, దక్షిణ ప్రాంతంలో రాళ్లపాడు, ఒంగోలు సమీపంలో గుండ్లకమ్మ వంటి వనరులు ఉన్నాయి.

భారీగా పడిపోయిన సాగు విస్తీర్ణం

ఉమ్మడి జిల్లా పరిధిలో సాగర్‌ ఆయకట్టులో 4.34లక్షల ఎకరాల విస్తీర్ణం ఉండగా కృష్ణా పశ్చిమకాలువ పరిధిలో 72వేల ఎకరాలు, గుండ్లకమ్మ కింద 80వేల ఎకరాలు, ఐదు మధ్యతరహా ప్రాజెక్టుల కింద 43వేల ఎకరాలు, మరో 953 చిన్ననీటి చెరువుల కింద లక్షా 35వేల ఎకరాలు, రెండు వందలకుపైగా ఉన్న ఎత్తిపోతల పథకాల కింద మరో లక్షా 40వేల ఎకరాల విస్తీర్ణం ఉంది. అయితే ఒక్క ఏడాది పూర్తిస్థాయిలో ఆయకట్టుకు కాదుకదా సగం విస్తీర్ణానికి కూడా ఆ నీరు అందుతున్న పరిస్థితి లేదు, మాగాణి సాగు అయితే నాల్గో వంతు కూడా ఉండటం లేదు. ఎక్కువ భాగంలో వాణిజ్య, వ్యాపార పంటలను రైతులు వర్షాధారంగా సాగు చేస్తున్నారు. సాగర్‌కాలువలు, అలాగే కృష్ణా పశ్చిమ కాలువ కింద చివరి ప్రాంతంలో జిల్లాలోని భూములు ఉండటంతో అవసరమైన మేర నీరు రావడం లేదు.

పాడి పరిశ్రమ కుదేలు

లెక్కల్లో ఉమ్మడి జిల్లాలో 4.34లక్షల ఎకరాల ఆయకట్టు సాగర్‌ కాలువల కింద ఉన్నప్పటికీ దాదాపు లక్షన్నర ఎకరాలకు ఏనాడు నీరు అందడం లేదు. మిగిలిన విస్తీర్ణంలో లక్ష ఎకరాల్లో కూడా మాగాణి సాగు చేయలేని పరిస్థితి. గత ఏడాది సాగర్‌ కాలువల కింద 2.75 లక్షల ఎకరాల్లో సాగు చేయగా 85వేల ఎకరాల్లో మాత్రమే అది కూడా దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లోనూ, కొంతమేర వైపాలెం పరిధిలోని త్రిపురాంతకం, ఎస్‌ఎన్‌పాడు పరిధిలోని చీమకుర్తి ఇతరత్రా కొద్దిచోట్ల మాత్రమే సాగు జరిగింది. కృష్ణా పశ్చిమ కాలువ పరిస్థితి కూడా అలాగే ఉంది. దీంతో తిండి గింజలు, పశువుల మేతకు గ్యారంటీ ఉండటం లేదు. జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు వ్యవసాయం తర్వాత ఆసరాగా నిలిచే పాడిపరిశ్రమ కూడా తీవ్రంగా దెబ్బతింది. పాడిరైతులకు బాసటగా నిలిచే ఒంగోలు డెయిరీని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మూతవేయడంతో ప్రైవేటు డెయిరీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వచ్చి మరింత ఇబ్బందిపడుతున్నారు.

బనకచర్లపైనే ఆశలు

సాగు, తాగునీటి వెతలు తీర్చేందుకు చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు మొత్తం జిల్లాకు ఆశాదీపంగా కనిపిస్తోంది. నల్లమల అటవీ సమీపంలో 53.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులు మూడొంతులకుపైగా పూర్తయ్యాయి. శ్రీశైలం నీటిమట్టం 843 అడుగుల నుంచే ప్రాజెక్టుకు నీటిని తీసుకునే అవకాశం కల్పించడంతోపాటు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించి విస్తృత కసరత్తును చేస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు వెలిగొండకే కాక జిల్లాకు వరం కానుంది. బనకచర్ల ఆచరణ రూపుదాల్చితే కృష్ణానదిపై శ్రీశైలం దిగువన ఉన్న ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు భూములకు గోదావరి జలాలను వాడుకునే అవకాశం ఉంటుంది. దాని వల్ల ఆ మేర కృష్ణానీటిని శ్రీశైలం ఎగువన ఉన్న ప్రాజెక్టులకు ఇవ్వవచ్చు. అందులో వెలిగొండకు కూడా లబ్ధి చేకూరుతుంది. ప్రాజెక్టు డిజైన్‌ ప్రకారం వెలిగొండకు కృష్ణాలో నెలరోజులపాటు వరద జలాలు ఉంటేనే నింపుకోవచ్చు. అయితే బనకచర్ల ప్రాజెక్టు రూపుదాల్చితే శ్రీశైలంలో ఎక్కువ రోజులు వెలిగొండకు నీరు తీసుకునే 843 అడుగుల నీటిమట్టం కన్నా అధికంగా నీరు నిల్వ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ రోజులు వెలిగొండకు నీటిని తీసుకోవచ్చు. ఆ నీటిని వెలిగొండ ద్వారా జిల్లాలోని ఇతర వనరులకు సరఫరా చేయవచ్చు.

గుండ్లకమ్మకు పుష్కలంగా నీరు

ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టుకు దిగువ ప్రాంతంలో గుండ్లకమ్మ ప్రవహిస్తుండటంతో ఆ నదికి వెలిగొండ నుంచి కృష్ణాజలాలను మళ్లించవచ్చు. దాని వల్ల గుండ్లకమ్మలో పుష్కలంగా నీటి ప్రవాహం ఉండి దిగువన ఉన్న ప్రాజెక్టు ఆయకట్టుతోపాటు వాటి పరిధిలో ఉన్న స్కీంలు, ఇతర వనరులకు నీరు ఇవ్వవచ్చు. అలాగే గుండ్లకమ్మ నీటిని ముసికి కూడా మళ్లించి కొండపి నియోజకవర్గంతోపాటు పొదిలి, సంతనూతలపాడు మండలాల్లోని గ్రామాల్లో ఉన్న వనరులకు పంపించవచ్చు. అలాగే వెలిగొండ పశ్చిమ కాలువ నుంచి దిగువ ప్రాంతాలైన గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల భూములతోపాటు ఆ ప్రాంతంలోని వాగులు, వంకల ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టు, మోపాడు రిజర్వాయర్‌తోపాటు చిన్న,పెద్ద చెరువులకు.. పాలేరు, మన్నేరు నదులకు నీరు వెళ్లేలా చేసే అవకాశం ఉంది. అలాగే సాగర్‌ కాలువలకు సక్రమంగా నీటి సరఫరా జరిగితే ఆ పరిధిలోని ఆయకట్టుకు ఢోకా లేకుండా ఇవ్వడంతోపాటు ఇటు వెలిగొండ, అటు సాగర్‌ నీరు రెండింటినీ అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి గతంలో ప్రతిపాదించి వదిలేసిన సాగర్‌ రెండో దశ ప్రాంతానికి కూడా నీటిని తరలించే అవకాశాలు ఉన్నాయి.

సమగ్ర ప్రణాళిక ఉంటేనే..

జిల్లాలోని అన్ని ప్రాంతాలకు కృష్ణా జలాలను తరలించేందుకు సమగ్ర నీటి పారుదల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆచరణలో అమలు చేయాలి. అందులో వెలిగొండ పూర్తి అన్నది మరింత కీలకాంశం. ఈ విషయమై 2023 ఆగస్టు తొలివారంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద నాడు టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు ప్రాజెక్టులపై యుద్ధభేరి పేరుతో నిర్వహించిన వర్క్‌షాపులో విస్తృత చర్చ జరిగింది. ఆ సందర్భంగా జిల్లాలోని నీటిపారుదల రంగంపై అధికారంలోకి వచ్చాక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. కీలకమైన వెలిగొండ పూర్తిచేయడంతోపాటు దాని ఆధారంగా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు కృష్ణా జలాలను తరలించేలా తక్షణం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

డెయిరీ కూడా కీలకమే..

వ్యవసాయం కన్నా అధికంగా రాబడి పాడిపరిశ్రమ ద్వారా జిల్లాలో ఉంది. ఆ రంగం ప్రస్తుతం ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రైవేటు డెయిరీలపై పరిశ్రమ ఆధారపడటంతో పశుపోషకులు నష్టపోతున్నారు. దశాబ్దాలపాటు జిల్లాలోని పాడిరైతులకు బాసటగా నిలిచిన ఒంగోలు డెయిరీని వైసీపీ ప్రభుత్వం మూసేసింది. ప్రస్తుతం అమూల్‌ వెళ్లిపోయినా సుమారు రూ.1500 కోట్ల ఆస్తులు, భారీ మిషనరీ, ఫ్యాక్టరీ ఉన్న డెయిరీ మాత్రం మూలనపడింది. తక్షణం ఒంగోలు డెయిరీని పునరుద్ధరించే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

Updated Date - Aug 02 , 2025 | 01:55 AM