Share News

Krishna Raju Controversial: కుట్ర కోణం ఉందా

ABN , Publish Date - Jun 22 , 2025 | 03:55 AM

రాజధాని మహిళలను కించపరిచేలా సాక్షి టీవీ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అని పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Raju Controversial: కుట్ర కోణం ఉందా

  • కృష్ణంరాజు వ్యాఖ్యలపై లోతుగా దర్యాప్తు

  • కస్టడీలో సమాధానాలపై పోలీసుల అనుమానాలు

  • రెండో రోజు పలు ప్రశ్నలకు నోరు విప్పని వైనం

  • వైసీపీ నేతల నుంచి నగదు బదిలీపై ఆరా

గుంటూరు, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): రాజధాని మహిళలను కించపరిచేలా సాక్షి టీవీ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అని పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. తమ విచారణలో లభించిన ఆధారాలను బట్టి పోలీసులు కుట్ర కోణాన్ని కనిపెట్టేందుకు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ముందస్తు స్ర్కిప్టు వచ్చిందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణంరాజును శుక్రవారం తుళ్లూరు పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. తొలిరోజు కస్టడీలో ఆయన పలు ప్రశ్నలకు నోరు విప్పకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వద్ద ఉన్న ఆధారాలకు ఆయన చెబుతున్న వివరాలకు పొంతన లేదని తెలిసింది. వైసీపీ నేతల ఖాతాల నుంచి కృష్ణంరాజు ఖాతాకు నగదు బదిలీ కావడంపై ప్రశ్నిేస్త తన యూట్యూబ్‌ చానల్‌, న్యూస్‌ అండ్‌ వ్యూస్‌ అనే ఆన్‌లైన్‌ పత్రికకు వారు ప్రకటనలు ఇస్తుంటారని చెప్పారు.


అయితే ఈవిషయంలో వాస్తవాలు ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ ప్రకటనలకు ఆధారాలు ఇవ్వాలని అడిగితే కృష్ణంరాజు సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. ఇప్పటికే పోలీసులు కృష్ణంరాజు బ్యాంక్‌ ఖాతాలు, కాల్‌ డేటాను విశ్లేషిస్తున్నారు. ఏఏ నేతల ఖాతాల నుంచి ఎంత నగదు బదిలీ అయింది, ఎవరెవరితో ఫోన్లో మాట్లాడింది పరిశీలిస్తున్నారు. చంద్రబాబుపై కక్షతోనే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు కృష్ణంరాజు చెప్పడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణంరాజు చెప్పినదాన్ని బట్టి ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తేలిందని అంటున్నారు. చంద్రబాబు మీద కక్ష ఉంటే రాజధాని మహిళల మీద ఎందుకు వ్యాఖ్యలు చేశారనేదానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే కస్టడీలో రెండో రోజు శనివారం పోలీసుల ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు అంటూ కృష్ణంరాజు దాటవేత ధోరణి ప్రదర్శించారని, మరికొన్ని ప్రశ్నలకు మౌనం వహించినట్లు తెలిసింది.

Updated Date - Jun 22 , 2025 | 03:55 AM