CPI Narayana: పేదల ఊటీని పతంజలికి ధారాదత్తం చేస్తారా
ABN , Publish Date - Jul 09 , 2025 | 07:40 AM
అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం, పేదల ఊటీగా పిలవబడే హార్స్‌లీహిల్స్‌లోని ఏపీ టూరిజం యూనిట్‌ను పతంజలి అధినేత రాందేవ్ బాబాకు ధారాదత్తం చేయాలనుకోవడం పొరపాటు నిర్ణయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

రాందేవ్ బాబా సన్యాసి ముసుగులో ఉన్న కార్పొరేట్ వ్యాపారి
ముఖ్యమంత్రి చంద్రబాబు పునరాలోచించాలి: సీపీఐ నారాయణ
బి.కొత్తకోట, జూలై 8(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం, పేదల ఊటీగా పిలవబడే హార్స్‌లీహిల్స్‌లోని ఏపీ టూరిజం యూనిట్‌ను పతంజలి అధినేత రాందేవ్ బాబాకు ధారాదత్తం చేయాలనుకోవడం పొరపాటు నిర్ణయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆయన మంగళవారం హార్స్‌లీహిల్స్‌కు వచ్చారు. ఇటీవల రాందేవ్ బాబా తిరిగిన ప్రదేశాలు, భవనాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘కమ్యూనిజం, సోషలిజం అవుట్ డేటెడ్, టూరిజమే ముఖ్యమన్న సీఎం చంద్రబాబు పర్యాటక అభివృద్ధిని మరిచారు. ప్రముఖ పర్యాటక యూనిట్లను ప్రైవేటుపరం చేస్తూ ఒక విష సంస్కృతిని తీసుకొస్తున్నారు. పతంజలి అధినేత రాందేవ్ బాబా ఒక దొంగబాబా. సన్యాసి ముసుగులో రూ.కోట్ల వ్యాపారాలు చేస్తున్న కార్పొరేట్ దిగ్గజం. ఉత్తరాదిలో పతంజలి సంస్థ నిర్వహిస్తున్న వెల్‌నెస్ సెంటర్లలో యోగా, ప్రకృతి వైద్యం పేరుతో అనైతిక, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సుందర ఆహ్లాదకర ప్రదేశమైన హార్స్‌లీహిల్స్‌లో పతంజలికి స్థానమిస్తే ఆ అభ్యంతరకరమైన విన్యాసాలు చేయించి అందాలకొండను అపవిత్రం చేస్తారు. హార్స్‌లీహిల్స్ కాస్ట్‌లీహిల్స్‌గా మారి సామాన్యులకు దూరం అవుతుంది. హార్స్‌లీహిల్స్‌పై పతంజలిని తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఈ విషయమై ముందుకు వెళితే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. హిల్స్‌కు సమీపంలోనే ఉన్న ప్రముఖ తత్వవేత్త జిడ్డు క్రిష్ణమూర్తి స్థాపించిన రిషివ్యాలీ లాంటి సంస్థలకు ఇచ్చినా అభ్యంతరం లేదు’ అని నారాయణ అన్నారు.