Raghurama Krishnaraju: పీ4లో ప్రవాసులు భాగస్వామ్యం కావాలి
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:16 AM
ఏపీలో 2047 నాటికి పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పీ4 (ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం) పథకంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు.

టాంపా ‘నాట్స్’ సంబరాల్లో రఘురామకృష్ణరాజు, నాదెండ్ల
(ఆంధ్రజ్యోతి కోసం టాంపా నుంచి కిలారు గోకుల్ కృష్ణ)
ఏపీలో 2047 నాటికి పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పీ4 (ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం) పథకంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. శనివారం టాంపా నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) నిర్వహిస్తున్న 8వ అమెరికా తెలుగు సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 15 లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపే ప్రణాళికతో ఏర్పాటైన పీ4 పథకానికి ప్రవాసులు చేయూతనందించాలని కోరారు. వారికి సీఎం తో పాటు కేబినేట్‌లో చర్చించి టీటీడీ దర్శనాల వంటి ప్రత్యేక సదుపాయాలు అందేలా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పీ4ను ప్రోత్సహించాలని కోరారు. 1980ల్లో టెన్నిస్ క్రీడాకారుడిగా తాను అమెరికాకు వచ్చినప్పుడు చూసిన టాంపా ఇప్పటి టాంపా వేరని అన్నారు. ప్రవాసులు ఏపీ క్రీడాకారులను ప్రోత్సహించాలని ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాల్ వద్ద ఏపీ స్పోర్ట్స్ అథారిటీ(సాప్) చైర్మన్ రవినాయుడు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాట్స్ పలువురికి పురస్కారాలు ప్రదానం చేసింది. డా.గురువారెడ్డి, మ్యాక్సివిజన్ ప్రసాదరెడ్డి, ఎటర్నల్ హెల్త్ ఐకా పూజ, డా.మాధవి శేఖరం, డా.దేవయ్య రుద్రమ్మలకు పురస్కారాలు అందజేసింది.