Share News

YSRCP: యువత లేని పోరు

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:18 AM

‘యువత పోరు’ పేరుతో సోమవారం వైసీపీ చేపట్టిన నిరసన అభాసుపాలైంది. యువత నుంచి ఎలాంటి స్పందనా లభించలేదు.

YSRCP: యువత లేని పోరు

వారి స్థానంలో వృద్ధ మహిళలు, గృహిణులను తరలించిన వైనం

  • అభాసుపాలైన వైసీపీ నిరసన

  • విశాఖలో 200 ఇచ్చి తరలించిన వైసీపీ ముఖ్య నాయకులు

(ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్‌): ‘యువత పోరు’ పేరుతో సోమవారం వైసీపీ చేపట్టిన నిరసన అభాసుపాలైంది. యువత నుంచి ఎలాంటి స్పందనా లభించలేదు. దీంతో వృద్ధులను, గృహిణులను తీసుకువచ్చి నిరసనను తూతూ మంత్రంగా చేపట్టారు. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుందని పార్టీ అధినేత జగన్‌ చెప్పినా.. కేవలం ఐదు జిల్లాల్లో మాత్రమే నామమాత్రంగా నిర్వహించారు. ‘వచ్చామా.. వెళ్లామా..’ అన్నట్టుగా వ్యవహరించారు. వైసీపీ యువజన విభాగం, సోషల్‌ మీడియా టీమ్‌ ఎంత ప్రయత్నించినా ‘యువత పోరు’కు ఏమాత్రం స్పందన కనిపించలేదు. వైసీపీ పాలనలో చోటు చేసుకున్న అక్రమాలపై విజిలెన్స్‌ విభాగం దర్యాప్తులు, స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌) దర్యాప్తులతో ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా జైలు పాలవుతున్నారు.


ఇదే సందర్భంలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ రెంటపాళ్ల పర్యటనలో కాన్వాయ్‌ కింద పడి సింగయ్య మృతి చెందిన ఘటన నేపథ్యంలో వాటిని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకు జగన్‌ యువత పోరుకు శ్రీకారం చుట్టారు. విశాఖ, గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లోని నేతలకు టార్గెట్‌ విధించారు. తాడేపల్లిలోని జగన్‌ నివాసం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్లకార్డులు కూడా పంపిణీ అయ్యాయి. అయితే.. ‘రప్పా-రప్పా’ ప్రభావంతో.. యువత పోరులో పాల్గొన్న నేతలు, కార్యకర్తులు ప్లకార్డులు, పోస్టర్లను పట్టుకునేందుకు జంకారు. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించినందున తొలి ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందంటూ వైసీపీ నేతలు మీడియా ముందు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బట్టీపట్టినట్లుగా.. ఒకే డైలాగ్‌ను నేతలంతా మాట్లాడటంతో ఇదంతా తాడేపల్లి నుంచి వచ్చిన స్ర్కిప్ట్‌గా అర్థమైంది. మొత్తానికి.. సోమవారం నాటి వైసీపీ యువత పోరులో నిరుద్యోగులు కంటే.. వృద్ధులు, గృహిణులే ఎక్కువగా కనిపించారు.


  • నెల్లూరులో ఆశించిన స్థాయిలో యువత రాకపోవడంతో వచ్చిన కొద్దిపాటి నాయకులు, కార్యకర్తలతో మమ అనిపించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి వచ్చి ర్యాలీకి జెండా ఊపీ వెళ్లిపోయారు. ర్యాలీలో ఎమ్మెల్సీతోపాటు ప్రధాన నాయకులు ఎవరూ పాల్గొనలేదు.

  • ఏలూరులో ‘యువత పోరు’ వెలవెలబోయింది. యువత, విద్యార్థులు పాల్గొనాల్సిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు మాత్రమే కనిపించారు. వైసీపీ యువజన విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా హాజరయ్యారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉండగా, పెద్ద సంఖ్యలో కలెక్టరేట్లోకి వెళ్లారు. ఇదే సమయంలో కార్యకర్తలు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

  • విశాఖపట్నంలో యువత పోరు నవ్వుల పాలైంది. ఈ ని రసనలో యువత కంటే వృద్ధ మహిళలు ఎక్కువగా కనిపించారు. దక్షిణ నియోజకవర్గానికి చెందిన నేత ఒకరు మనిషికి రూ.200 ఇద్దామని, ర్యాలీకి మనుషుల్ని తేవాలని కొందరికి బాధ్యత అప్పగించారు. వారు వృద్ధ మహిళలను తీసుకువచ్చారు. వారి చేతికి ‘ఫ్యాన్‌ గుర్తుకే ఓటు’ అని రాసున్న జగన్‌ బొమ్మతో కూడిన జెండాలు ఇచ్చారు.

Updated Date - Jun 24 , 2025 | 04:18 AM