Nellore : నెల్లూరుకు జగన్.. నగరంలో హై అలర్ట్
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:17 AM
Jagan Tour: నెల్లూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం పర్యటన వేళ నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. నగరంలో ఎటు చూసినా పోలీసు బలగాలు మోహరించడంతో హైటెన్షన్ వాతవరణం ఏర్పడింది.

నెల్లూరు, జులై 31: జిల్లాలో హైటెన్షన్ వాతవరణం నెలకొంది. ఇవాళ(గురువారం) నగరంలో మాజీ సీఎం జగన్ పర్యటన వేళ భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించి పోలీసులు అంక్షాలు విధించగా.. వాటిని పట్టించుకోకుండా వైసీపీ నాయకులు జనసమీకరణ చేయడంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యనేతలతో పాటు కొందరు నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా నెల్లూరులో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు.. నగరాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కళ్లుగప్పి నగరంలోకి కొందరు వైసీపీ కార్యకర్తలు ప్రవేశిస్తున్నట్లు సమాచారంతో వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. వైసీపీ(YCP) శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జనసమీకరణ చేపట్టొద్దని ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ హెచ్చరించిన, వైసీపీ నేతలు హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు పలువురి వైసీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేసుల్లో చిక్కుకోవద్దు...
నెల్లూరు జైలులో పలు కేసుల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణితో జగన్ ములాకత్ కానున్నారు. అనంతరం జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న(Ex MLA Prasanna) నివాసానికి చేరుకుంటారు. మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై(MLA Vemireddy Prashanthi Reddy) తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడుగా ఉన్న ప్రసన్నని పరామర్శించనున్నారు. కాగా.. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఇన్‌ఛార్జి ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. యువత చట్టవ్యతిరేకంగా వ్యవహరించి కేసుల్లో చిక్కుకోవద్దని ఎస్పీ సూచించారు.