Nadendla Manohar: సరికొత్తగా... నాణ్యమైన యూనిఫాం
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:29 AM
రాజకీయ నాయకుల ఫొటోలు.. పార్టీ జెండాల రంగులూ లేకుండా సరికొత్త యూనిఫాంను కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

రాజకీయ రంగులు, ఫొటోలు లేవు: మంత్రి మనోహర్
తెనాలి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): రాజకీయ నాయకుల ఫొటోలు.. పార్టీ జెండాల రంగులూ లేకుండా సరికొత్త యూనిఫాంను కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం ఆయన పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు అందించే పుస్తకాలు, బ్యాగ్‌లు, యూనిఫాంపై ఎటువంటి రాజకీయ రంగులు, నాయకుల ఫొటోలను కానీ కూటమి ప్రభుత్వం ముద్రించనివ్వలేదన్నారు. సరికొత్త రంగుల్లో, నాణ్యతతో ఉన్న వస్తువులు అందించామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన బ్యాగ్‌లు, బూట్ల కొనుగోళ్లలోనూ కక్కుర్తి చూపించిందని, అందుకే అవి పట్టుమని పది రోజులు కూడా చిన్నారులకు ఉపయోగపడలేదన్నారు. పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థుల భోజనానికి సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పారు. విద్యార్థుల కోసం తక్కువ ధరకు ధాన్యం అందజేసిన రైతులకు సత్కార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.