Share News

Mohith Reddy: మద్యం స్కాంలో మోహిత్‌రెడ్డికి నోటీసులు

ABN , Publish Date - Jun 24 , 2025 | 07:12 AM

మద్యం స్కాం కేసు దర్యాప్తులో సిట్‌ మరో ముందడుగు వేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉండి ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డికి నోటీసులు జారీచేసింది. బుధవారం విజయవాడలోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.

Mohith Reddy: మద్యం స్కాంలో మోహిత్‌రెడ్డికి నోటీసులు

  • రేపు విచారణకు రావాలని సిట్‌ పిలుపు

  • మద్యం స్కాంలో రేపు విచారణకు రావాలని పిలుపు

  • ఆయన తుడా చైర్మన్‌గా ఉండగా ఆ సంస్థ వాహనాల్లో ముడుపుల తరలింపు

  • చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా కోట్లు పంచినట్లు ఆధారాలు

అమరావతి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): మద్యం స్కాం కేసు దర్యాప్తులో సిట్‌ మరో ముందడుగు వేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉండి ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డికి నోటీసులు జారీచేసింది. బుధవారం విజయవాడలోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు మద్యం ముడుపుల సొమ్మును రూ.వందల కోట్లలో వైసీపీ నాయకత్వం తమ అభ్యర్థులకు అందజేసినట్లు దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన 43 మంది అసెంబ్లీ అభ్యర్థులు, నలుగురు లోక్‌సభ అభ్యర్థులకు చెవిరెడ్డి ద్వారా పంపిణీ చేయడానికి ఆ డబ్బును తుడా అధికారిక వాహనాల్లో తరలించినట్లు సిట్‌ పలు టోల్‌గేట్లలో సీసీ ఫుటేజీ సంపాదించింది. ఇదే సమయంలో తుడా వాహనాలు పరిధి దాటి వెళ్లలేదని అధికారిక లాగ్‌ బుక్‌లో నమోదైంది. రెండింటినీ పరిశీలించిన దర్యాప్తు అధికారులు.. అధికారిక వాహనాలను ఎన్నికల్లో డబ్బులు తరలించేందుకు వినియోగించిన అప్పటి తుడా చైర్మన్‌ మోహిత్‌రెడ్డిని ఇటీవల ఈ కేసులో 39వ నిందితుడిగా చేర్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను విచారణకు పిలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఏసీబీ కోర్టుకు మోహిత్‌రెడ్డి

మద్యం కేసులో సిట్‌ నోటీసుల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ కోసం మోహిత్‌రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో సోమవారం పిటిషన్‌ వేశారు. దీనిపై కౌంటర్‌ వేయాలని న్యాయాధికారి భాస్కరరావు సిట్‌ను ఆదేశించారు. విచారణను మంగళవారానికి వాయిదావేశారు.

Updated Date - Jun 24 , 2025 | 07:12 AM